Tuesday, March 28, 2023

తెరపడే నాటకరంగానికి జీవం

తెరపడే నాటకరంగానికి జీవం
నేడు ప్రపంచ రంగస్థల దినోత్సవం
(ఎస్.ఎన్. చారి, ఈనాడు జర్నలిస్టు, మోత్కూర్, యాదాద్రి భువనగిరి జిల్లా, 27 మార్చి 2023)


 Web Link: https://www.eenadu.net/telugu-news/districts/Nalgonda/534/123053738

Web Archive Link: https://web.archive.org/web/20230327103902/https://www.eenadu.net/telugu-news/districts/Nalgonda/534/123053738

Thursday, January 12, 2023



లక్ష్య సాధకులు - పురస్కారాల వికీపీడియన్ 

(ఈనాడు, యాదాద్రి భువనగిరి జిల్లా)


మోత్కూరు: అంతర్జాలంలో అతిపెద్ద విజ్ఞాన సర్వస్వమైన తెలుగు వికీపీడియా 19 సంవత్సరాలు పూర్తిచేసుకుని 20వ వసంతంలోకి అడుగుపెట్టింది. మోత్కూరుకు చెందిన ప్రణయ్ రాజ్ వంగరి వికీపీడియన్ గా రోజుకొకటి చొప్పున 2017లో ఏడాది పాటు వరుసగా 365 కథనాలు రాసి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందారు. 2022లో మొత్తంగా 850 వ్యాసాలు రాసి వికీపీడియాలో పొందుపరుస్తూ తన రికార్డును తానే అధిగమించారు. ఈయన 2016 నుంచి తెలుగు వికీపీడియాలో రోజుకో వ్యాసం రాస్తున్నారు. 2016 జూన్ లో ఇటలీలో జరిగిన అంతర్జాతీయ స్థాయి వికీపీడియన్ సదస్సుకు అధికారికంగా హాజరయ్యారు. 2016 సెప్టెంబరులో మన దేశంలోని చండీగఢ్ జరిగిన ప్రపంచ స్థాయి సదస్సుకు అధికారికంగా హాజరై పలువురి ప్రశంసలు, అవార్డులందుకున్నారు. '2022 డిసెంబరు నాటికి 80 వేలకు పైగా తెలుగు వ్యాసాలు వికీపీడియాలోకి చేరాయ'ని ప్రణయ్ రాజ్ చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 26,811 గ్రామాలు, 1,277 మండలాలకు చెందిన పేజీలు ఉన్నాయని పేర్కొన్నారు.

Web Link: https://www.eenadu.net/telugu-news/districts/Nalgonda/534/123007263

Web Archive Link: https://web.archive.org/web/20230112055931/https://www.eenadu.net/telugu-news/districts/Nalgonda/534/123007263

Friday, December 23, 2022

20వ వసంతంలోకి తెలుగు వికీపీడియా (ఈనాడు మెయన్ 23.12.2022)

20వ వసంతంలోకి తెలుగు వికీపీడియా
20వ వసంతంలోకి తెలుగు వికీపీడియా (ఈనాడు మెయిన్ అంధ్రప్రదేశ్)

20వ వసంతంలోకి తెలుగు వికీపీడియా
20వ వసంతంలోకి తెలుగు వికీపీడియా (ఈనాడు మెయిన్ హైదరాబాదు)

20వ వసంతంలోకి తెలుగు వికీపీడియా
20వ వసంతంలోకి తెలుగు వికీపీడియా (ఈనాడు మెయిన్ తెలంగాణ)

 





20వ వసంతంలోకి తెలుగు వికీపీడియా
నెలకు 15 లక్షల మంది వీక్షణ
25న ప్రత్యేక వేడుకలకు ఏర్పాట్లు

ఊళ్లు.. ప్రముఖ వ్యక్తులు.. చారిత్రక కట్టడాలు.. ప్రదేశాలు.. ఇలా ఏ సమాచారం కావాలన్నా.. ఠక్కున గుర్తుకొచ్చేది వికీపీడియా. ఇది తెలుగులోనూ విజ్ఞానాన్ని అందిస్తోంది. మొబైల్ యాప్‌లోనూ సమాచారం తెలుసుకునే వీలుంది. 20వ వసంతంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఈ నెల 25న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 వరకు రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్‌లో తెలుగు వికీపీడియన్లందరూ కలిసి వేడుకలు నిర్వహించనున్నారు. తప్పుల్లేకుండా రాయగలిగితే చాలు.. ఎవరైనా వికీపీడియాలో వ్యాసాలు పొందుపరచవచ్చు. వ్యాసాలు, ఫొటోలను అభివృద్ధి చేసేందుకు నిర్వాహకులు ప్రత్యేకంగా పోటీలు నిర్వహిస్తుంటారు. ఉత్తమంగా నిలిచిన వారికి బహుమతులు, అవార్డులు అందిస్తుంటారు.

ఎన్నో ప్రత్యేకతలు..
* తెలుగు రాష్ట్రాలకు చెందిన 26,811 వేల గ్రామాల సమాచారంతో పేజీలున్నాయి.
* 1277 మండలాలకు చెందిన పేజీలు అందుబాటులో ఉన్నాయి.
* 2016లో తెలంగాణ, ఈ ఏడాది ఏపీలో జరిగిన జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణ తర్వాత సమాచారం సైతం అందుబాటులో ఉంది.
* ఆయా జిల్లాలు, మండలాల భౌగోళిక పరిస్థితిని ప్రతిబింబించేలా ప్రభుత్వ అధికారిక సమాచారం సేకరించి నిక్షిప్తం చేశారు. దాదాపు 60 వేల పేజీల గ్రామ, మండల, జిల్లాల సమాచారాన్ని పొందుపరిచారు.
* సినిమాలకు సంబంధించి దాదాపు ఏడు వేల వ్యాసాలు రాశారు. ఇవి 15 వేల పేజీల్లో నిక్షిప్తమయ్యాయి.

మారుమూల సమాచారం లభ్యం
- వి. ప్రణయరాజ్, తెలుగు వికీపీడియన్

వికీపీడియాలో సమాచారం ఉచితంగా లభిస్తుంది. ఇక్కడ ఎవరైనా రాయవచ్చు. ఫొటోలు అప్లోడ్ చేయవచ్చు. అందుకే మారుమూల ప్రాంతాల సమాచారం, ఫొటోలు లభ్యమవుతున్నాయి. ఇందులోని వ్యాసాలను పుస్తకంగా ప్రింట్ చేసుకోవచ్చు.. అమ్ముకోవచ్చు. ఇందుకు వికీపీడియాకు ఒక్క రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు. కేవలం ‘వికీపీడియా నుంచి తీసుకున్నాను' అని రాస్తే సరిపోతుంది.

News Link: https://www.eenadu.net/telugu-news/ap-top-news/general/2501/122238812

Web Archive Link: https://web.archive.org/web/20221223043907/https://www.eenadu.net/telugu-news/ap-top-news/general/2501/122238812

Tuesday, February 22, 2022

వికీపీడియా గ్రాంటుకు ప్రణయ్‌రాజ్ ఎంపిక






 

చరిత్రలో మనకో పేజీ (ఈనాడు బ్యానర్ ఐటం)


 


వికీపీడియానే.. ప్రణయ్‌ రాజ్యం!

#లైఫ్_జర్నీ
12.07.2020, నమస్తే తెలంగాణ-బతుకమ్మ సంచిక
శనార్తులు Daayi Sreeshailam అన్న
 
*వికీపీడియానే.. ప్రణయ్‌ రాజ్యం!*
యాదాద్రి భువనగిరిజిల్లా మోత్కూరులో మధ్యతరగతి చేనేత కుటుంబం మాది. చిన్నప్పటి నుంచి అందరిలో ప్రత్యేకంగా ఉండేవాడిని. మా అమ్మ పెండ్లి అప్పగింత పాటలు.. బతుకమ్మ పాటలు పాడుతుండేది. మా నాన్నేమో సినీ అభిమాని. షోలాపూర్‌లో ఉన్నప్పుడు ఒక్కో సినిమాను 20-30 సార్లు చూసేదంట. వాళ్ల కళను చూసి నాకూ కళారంగం పట్ల ఆసక్తి ఏర్పడింది. అందరూ రకరకాల ఆటలు ఆడుతుంటే.. నేనేమో రేడియోలో పాటలు వింటూ ఉండేవాడిని. మా అక్క తెచ్చుకున్న సినిమా పాటల పుస్తకాలను దొరకబట్టి సొంతంగా నేనే పాడటం నేర్చుకున్నా. అలా పాటలు పాడటం అలవాటై.. స్కూల్లో.. వినాయక చవితి ఉత్సవాల్లో.. ఊర్లో ఎవరిదైనా పెండ్లి అయితే వెళ్లి పాటలు పాడేవాడ్ని. అట్లనీ చదువును నిర్లక్ష్యం చేయలేదు. ఆగస్ట్‌ 15, జనవరి 26కు స్కూల్లో అందరూ ఆటలు ఆడి ప్రైజులు తీసుకుంటే.. నా కళ ద్వారా అంతకంటే పెద్ద ప్రైజులు తీసుకోవాలని అనుకునేవాడిని. 
 
‘మనసిచ్చి చూడు’ సినిమాలో సిరివెన్నెల రాసిన ‘బోడి చదువులు వేస్టు’ అన్న పాట నన్ను చాలా ప్రభావితం చేసింది. ‘మార్కుల కోసం ఏడవలేదురా.. ఎదిగిన ఏ సైంటిస్టూ.. గుర్తుపట్టరా ఏ రంగంలో ఉందో నీ ఇంట్రెస్టూ.. నీక్కూడా ఉండే ఉంటుంది ఏదో ఒక టాలెంటు.. నీకు నువ్వు బాసవ్వాలంటే దానిని బయట పెట్టు’ అన్న లైన్లు నాలో గట్టిగా నాటుకుపోయాయి. అప్పటివరకు ఎలాంటి ఆలోచనలేని నాకు.. నాకిష్టమైన రంగం ఏంటో అని నిర్ణయించుకునేలా చేసింది. చిన్నప్పుడు ఊర్లో చిందు భాగవతాలు.. పౌరాణిక నాటకాలు చూసి నా ఫ్రెండ్స్‌తో కలిసి చిన్న చిన్న స్కిట్స్‌ వేసేవాళ్లం. ఆ అనుభవమేమైనా మనకు రూట్‌ చూయిస్తుందేమో అని ఆలోచించాను. బాగుంటుంది అనిపించింది. డాక్టర్‌ కావాలని ఇంటర్‌లో బైపీసీ తీసుకున్న నేను క్రమక్రమంగా కళారంగం పట్ల ఆసక్తి ఎక్కువై కొత్త దారిలో ప్రయాణించేట్లు చేసింది.
మిమిక్రీ నేర్చుకున్నా. 2006లో మోత్కూరులో పోతన కళా వారోత్సవాలు జరుగుతున్నాయి. రామన్నపేట నియోజకవర్గ స్థాయిలో మిమిక్రీలో రెండో బహుమతి అందుకున్నా. అదే నాకు వచ్చిన తొలి షీల్డు. ఆటల్లో ఫ్రెండ్స్‌ షీల్డ్‌లు కొట్టినప్పుడు వాళ్లలో ఇంత కిక్‌ కనిపించేది కాదు. నాది కళ కాబట్టి మండల స్థాయి ప్రైజే అయినా ఎంతో సంతృప్తినిచ్చింది. అన్నింటినీ కంపేర్‌చేసి చూసుకున్నా. కళారంగంలో ఉండే పేరు.. సంతోషం.. సంతృప్తి నన్ను మరింత ప్రేరేపించాయి. నేను వెళ్తున్న రూట్‌ సరైందే అనిపించింది. కళారంగం కరెక్టేగానీ.. ఏ విభాగం ఎంచుకోవాలె అనేంత క్లారిటీ అయితే లేకుండె. కాకపోతే అప్పటికే నాకు నటించడమూ.. రాయడమూ.. పాడటమూ.. వీటన్నింటినీ ప్రదర్శింపజేసే నైపుణ్యమూ ఉంది. 
 
డిగ్రీ తర్వాత 2006లో హైదరాబాద్‌ వచ్చిన. ఇక్కడే సెటిలై అనుకున్నది సాధించాలంటే ముం దుగా మనకొక మార్గం కావాలి. ఫ్రెండ్స్‌ సహాయంతో ‘హెరిటేజ్‌ ఫ్రెష్‌' కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్లగా, కస్టమర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం వచ్చింది. వాస్తవానికి అప్పటివరకు నాకు సూపర్‌మార్కెట్‌ అంటే కూడా తెలియదు. డిగ్రీ దాకా గ్రామీణ వాతావరణంలోనే ఉన్నాను కాబట్టి, చిన్నచిన్న అంగళ్లు.. మార్కెట్లు మాత్రమే తెలుసు. ఉద్యోగమైతే దొరికింది కదా అనుకొని చేరాను. ట్రైనింగ్‌ తర్వాత శివంరోడ్డులో ఉన్న హెరిటేజ్‌ ఫ్రెష్‌లో డ్యూటీ. నాతోపాటు ఇంకో ఇరవైమంది ఉండేవారు. నాది కూరగాయల సెక్షన్‌. ఉదయం ఆరింటికి వెళ్లి అన్నీ శుభ్రంచేసుకొని.. కూరగాయలు రాగానే వాటిని రాక్స్‌లో సెట్‌చేసి.. కస్టమర్లకు అందుబాటులో ఉంచాలి. ఇదే నా పని. పొద్దున్నే లేవడం.. రెడీ అవ్వడం.. డ్యూటీకి వెళ్లడం. వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ గజిబిజిలో 18 నెలలు గడిచిపోయాయి.
సూపర్‌ మార్కెట్‌లో కుళ్లిపోయిన కూరగాయలు ఏరుతూ.. రాక్స్‌ శుభ్రం చేస్తూ.. కూరగాయలు కడుగుతూ ఉన్నప్పుడు ‘అసలు నేనెందుకు హైదరాబాద్‌ వచ్చాను? ఏం చేస్తున్నాను? కళ ఎటుపోయింది? చేయాల్సింది ఇది కాదేమో’ అనిపించింది. 2008లో ఒకరోజు.. ఎప్పటిలాగానే పొద్దున్నే లేచి, రెడీ అయ్యాను. బ్యాగు భుజానికి వేసుకున్నాను. సూపర్‌మార్కెట్‌ మెట్లు ఎక్కుతుండగానే ‘ఇలా ఎన్నిరోజులు?’ అనిపించింది. అప్పటికప్పు డే ‘నేను ఇక డ్యూటీకి రాను’ అని చెప్పేశాను.
కానీ ఏం చేయాలి? నాలో ఉన్న కళను ఎలా మెరుగుపర్చుకోవాలి? అని నిత్యం ఆలోచనలు వెంటాడేవి. ఏమీ తోచక మళ్లీ ఊరికి వెళ్లాను. ఖాళీగా ఉంటే బాగుండదు.. ఇంకోటి పేరెంట్స్‌కు కూడా నమ్మకం కలిగించాలి కదా అని చాలాకాలం మగ్గం నేశాను. అప్పుడే తెలుగు విశ్వవిద్యాలయంలో థియేటర్‌ ఆర్ట్స్‌ కోర్సు గురించి తెలిసింది. ఎలాగూ డిగ్రీ చదివాను. హైదరాబాదులో ఉండాలంటే ఫుడ్‌.. బెడ్‌ కావాలి. యూనివర్సిటీలో జాయిన్‌ అయితేనే హాస్టల్‌ వసతి దొరుకుతుంది అని అప్లయ్‌ చేశాను. ఇంటర్వ్యూకి పిలిచారు. అలా ఉంటుందని కూడా నాకు తెలియదు. అప్పటికప్పుడు ఒక డైలాగ్‌ చెప్పమన్నారు. చిన్న ఎన్టీఆర్‌ యమదొంగ సినిమాలోని ఒక డైలాగ్‌ చెప్పాను. బాగుందన్నారు. ‘కోర్సులో చేరితే కచ్చితంగా ప్రతిరోజూ క్లాసులకు రావాలి.. యూనివర్సిటీ హాస్టల్లో నే ఉండాలి’ అని చెప్పారు. నాక్కావల్సిందీ అదే కదా? ‘అట్లాగే సార్‌' అని చెప్పాను. అలా వసతి కోసం.. తిండికోసం థియేటర్‌ ఆర్ట్స్‌లో చేరిన నేను అదే రంగంలో స్థిరపడేలా థియేటర్‌ నాకు ఎంతో గుర్తింపును ఇచ్చింది. ఆ తర్వాత పెండ్లయింది. నాటకంపై ఉన్న ఇష్టంతో మా పాపకు ‘యవనిక’ (స్టేజి ముందరి తెర) అని పేరు కూడా పెట్టుకున్నా. పాప్‌కార్న్‌ థియేటర్‌ స్థాపించి నాటక ప్రదర్శనలు ఇస్తున్నాం. 
 
2010లో జెమినీ టీవీలో వచ్చిన ‘దేవత’, 2015 లో దూరదర్శన్‌లో వచ్చిన ‘చంటిగాడి స్వయంవరం’ ధారావాహికలకు సహాయ దర్శకుడిగా, 2015లో వచ్చిన ‘ఎ-ఫైర్‌' చిత్రానికి ప్రచారకర్తగా, 2017లో వచ్చిన ‘అవంతిక’ చిత్రానికి సహా య దర్శకుడిగా పనిచేశా. పైడి జైరాజ్‌ ప్రి వ్యూ థియేటర్‌ వేదికగా తెలంగాణ సినిమా నిర్మాణంలో నావంతు భాగస్వామ్యాన్ని అందిస్తున్నా. అనుభవించినప్పటి కంటే, దాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు కలిగే అనుభూతి గొప్పగా ఉంటుందని నమ్ముతా. అందుకోసం ప్రతీది రికార్డు చేసి పెట్టుకోవాలని అనుకునేవాడిని. మహనీయుల సూక్తు లు.. పాటలు.. ఉపన్యాసాలలోని ముఖ్యాంశాలు రాసుకోవడం అలవాటయింది. నాకు తెలిసిన సమాచారాన్ని ఇతరులకు అందించడం అనేది నాకున్న ఇంకో అలవాటు. అదే ఉద్దేశ్యంతో 2013, మార్చి 8న వికీపీడియాలో చేరాను. అందులో ఇప్పటివరకు దాదాపు 1700 వ్యాసాలు రాసిన. వికీ శిక్షణా శిబిరాలు, సమావేశాలు నిర్వహిస్తూ వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్నందుకు నిర్వాహక హోదా వచ్చింది. ‘వికీవత్సరం’ అనే కాన్సెప్ట్‌తో వరుసగా 365రోజులు - 365 వ్యాసాలు రాసి ప్రపంచ వికీపీడియా మొత్తంలో రికార్డు సాధించాను. దాన్ని అలాగే కొసాగిస్తూ 1400 రోజులు పూర్తిచేశాను. 
 
వికీపీడియాలో స్వచ్ఛందంగా వ్యాసాలు రాయాల్సివుంటుంది. మొదట్లో ఎవరికన్నా వికీ రచన గురించి చెబితే ‘ఏదైనా పైసలు వచ్చే పని చేసుకోవచ్చు కదా’ అనేవాళ్లు. వికీలో ఏదో ఒకటి సాధించి వాళ్ళందరి ముందూ నేనంటే ఏమిటో చూపించాలని అప్పుడే నిర్ణయించుకున్నా. వికీలో రికార్డు సాధించిన తర్వాత వాళ్లే వికీపీడియా గురించి గొప్పగా చెప్పుకున్నారు. ఎవరికైనా ఏదైనా సమాచారం కావాలన్నా.. ఏదైనా పుస్తకం కావాలన్నా నన్నే అడుగుతుంటారు. వాళ్లకు కావాల్సింది ఇవ్వడంలో ఉన్న తృప్తి ఇంకెందులోనూ లేదు.. ఉండదు. వికీ వ్యాసాలు రాస్తుంటే అలాంటి తృప్తే కలుగుతుంది. అందరూ ఏదైనా సమాచారం కావాలంటే వికీపీడియాను ఆశ్రయిస్తారు. నేను వాళ్లను దృష్టిలో ఉంచుకునే సమగ్రంగా వ్యాసాలు అందిస్తుంటా. నా సమాచారం ద్వారానే తమతమ కోణాల్లో కథనాలు రాసుకుంటారు. ఇది ఒక రకంగా నాకు వరమే అనుకోవచ్చు. 2016లో వికీపీడియా సదస్సుకు ఇటలీ వెళ్ళినప్పడు, అక్కడ ఇతర దేశాల వికీపీడియన్లతో పరిచయం ఏర్పడింది. తెలుగు వికీపీడియా ద్వారా చేస్తున్న తెలుగు భాష అభివృద్ధి.. తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహం గురించి వారికి చెప్పాను. అంతా ప్రశంసించారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేస్తున్న కృషికి పలువురు ప్రముఖుల నుండి ప్రశంసలు అందుతున్నాయి. అలాంటి సందర్భాల్లో ఎంతో ఆనందం వేస్తుంది. 
 
2017 సెప్టెంబర్‌ 8.. గుంటూరులోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ‘ఆకాశదేవర’ నాటకం రిహార్సల్స్‌ చేస్తున్నా. నా వాట్సప్‌కి ఒక మెసేజ్‌ వచ్చింది. చూసి నమ్మలేకపోయాను. సంవత్సరంపాటు రోజూ ఒక వ్యాసం చొప్పున తెలుగు వికీపీడియాలో రాసి.. ప్రపంచరికార్డు సాధించిన సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నా గురించి రాసిన ట్వీట్‌ అది. ఆ క్షణం ఇదికదా జీవితం అనిపించింది. అంతకుముందురోజే నా వికీవత్సరం పూర్తయింది. ఆ రోజు వికీమీడియా ఫౌండేషన్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ అసఫ్‌.. తెలుగు వికీపీడియా సభ్యులు నన్ను సత్కరించారు.
 
 
 

 

Wednesday, April 03, 2019

తెలంగాణపై నిందలేల సారులు..?

తెలంగాణపై నిందలేల సారులు..?

(మన తెలంగాణ_30.03.2019)

ఇదేం కాలం అంటే ఎండాకాలం అని ఎటకరించకండి. కలికాలమనో కలిసిపోయే కాలమనో మిటకరించకండి. ఓటు హక్కు వయసోళ్లంతా ఇదేం కాలమంటే ఎన్నికల కాలమనే చెప్పాలి. ఈ కాలానికనుగుణంగా ఏమేం టాపిక్స్ జరుగుతుంటయ్, ఏమేం పిక్స్ హాట్ టాపిక్స్ అవుతుంటయ్ అని ఎంత సెర్చినా, గూగుల్ తల్లినడిగినా, ఈకాలపు సెర్చ్ ఫిగర్లెవరంటే... ఇంకెవరు కేసీఆర్, చంద్రబాబు, జగన్, కేటీఆర్, పవన్ కళ్యాణ్, లోకేష్ అనే చూపిస్తుంది. తెలంగాణ ఆంధ్రలో ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకున్నా, ఎవరి మద్దతుదార్లు వాళ్ళవాళ్ళ ప్రమోషన్ దార్లు వాళ్ళకున్నా అసలు నేషనల్ లెవెల్ లో రాజకీయాలకు అతీతంగా కామన్ మ్యాన్ వాయిస్, మేనిఫెస్టో ఎట్లుంటయో ఎరుకనా..?
ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో, ఎవరూ ఎవరికి సపోర్టుగా నిలుస్తరో, ఎవరెవరి మధ్యన అంతర్గత ఒప్పందాలున్నయో ఎటూ తేలని విధంగా ఉన్నయి. అయితే, ఎవరూ అధికారంలోకి వచ్చినా సగటు మనిషి మనుగడ రోజురోజుకు ప్రశ్నార్థకంగా మారుతూనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ అధినేతలపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నయో, వారు ఎలా స్వీకరిస్తున్నరో ఒకసారి ఆలోచిస్తే...
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోవటం, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తలదూర్చటం తెలంగాణ ప్రజలు హర్షిస్తలేరు. చంద్రబాబును మాజీ ముఖ్యమంత్రిగా సమర్ధనేతగా అంగీకరిస్తూనే ఆయన పదేపదే పాత పాట పాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నరు. తాను తెలంగాణ అభివృద్థి ప్రధాతనని, హైటెక్ సిటీ కట్టింది సైబరాబాద్ సృష్టించింది ఐటీ పరిశ్రమకు ఆధ్యుడిని నేనేనని చెప్పుకోవటం ప్రస్తుతం హాస్యాస్పదంగా మారింది. హైదరాబాదులోని సెటిలర్ల ఓట్లతో తిరిగి తెలంగాణ రాజకీయాల్లోకి దూరాలని చూసిన చంద్రబాబుకు ఆ సెటిలర్సే తెలంగాణలో టిడిపికి ఉనికి లేకుండా చేసిర్రు. తోటి తెలుగు రాష్ట్రంగా తెలంగాణ కొత్త రాష్ట్రానికి మద్దతుగా ఉండాల్సిందిపోయి అడ్డుతగిలే యత్నాలు చేస్తుండటం, అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో హైదరాబాదు సభల్లో రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ప్రాంతీయత భావాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడటం పట్ల తెలంగాణ ప్రజలతోపాటు, హైదరాబాదులోని సెటిలర్స్ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నరు. ఆయన తెలంగాణ పట్ల సానుకూలంగా ఉంటే తెలంగాణ ప్రజలు సైతం ఏపీకి ప్రత్యేకహోదా సాధనలో భుజం కలిపేవారన్నది వాస్తవం. ఇదిలావుంటే, నోట్ల రద్దు విషయంలో మరియు ప్రత్యేక హోదా విషయంలో రెండు నాలుకల ధోరణిలో మాట్లాడటంవల్ల తన సొంతరాష్ట్ర ప్రజలనుండి కూడా తనకు చుక్కెదురు పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ దిక్కులేని చంద్రబాబు సెంటిమెంట్ అనే దిక్కును వాడుకుంటున్నడు. తెలంగాణ ఎన్నికల్లో తలదూర్చినందుకు రిటర్న్ గిప్ట్ ఇస్తానన్న కేసీఆర్ మాటను అవసరమున్నా లేకున్నా పదేపదే ఉపయోగిచుకుంటూ ఆంధ్ర ప్రదేశ్ ప్రజల సానుభూతికోసం ప్రాకులాడుతున్నడు. ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతో ఆత్మనూన్యతాభావానికి గురైన చంద్రబాబు ముఖంలో అభధ్రతాభావం స్పష్టంగా కనిపిస్తుంది.
ఇక చంద్రబాబు వారసుడు లోకేష్ మాట్లాడుతున్న విధానం ఆయనకున్న రాజకీయ అవగాహనా రాహిత్యాన్ని సూచిస్తుంది. వేదికనెక్కిన ప్రతిసారీ ఏదో ఒక తప్పు మట్లాడటమో, తన పార్టీనీ తానే తిట్టుకోవడమో చేసే లోకేష్ ఏ సభలో ఏం మాట్లాడుతరో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీని ప్రభావమంతా లోకేష్ ప్రచారంపై పడి, మంగళగిరిలో ప్రచారానికి వెళ్ళిన లోకేష్ వెంట కనీసం 50మంది కూడా రానంత వరకు దారితీసింది. ఇవన్ని చూసికూడా తన స్థాయి ఎంటో తెలుసుకోలేని లోకేష్ కొద్దిరోజులకిందట సీఎం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగించినయి. ఒకవైపు తెలంగాణ సీఎం తనయుడు కేటీఆర్, మరోవైపు కూతురు కవిత తమ తండ్రిని మించిన రాజకీయ పరిణితి కనబరుస్తూ దేశవ్యాప్త ప్రశంశలు పొందుతుంటే లోకేష్ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని జనం అభిప్రాయ పడుతున్నరు. అందుకే కాబోలు ఆయనకు ముద్దుపేరు కూడా పెట్టుకున్నరు.
వీళ్ళిద్దరి పరిస్థితి ఇలావుంటే తెలంగాణ జనం పవనాల్ సార్ అని పిలుచుకునే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరిస్థితి మరోలా ఉంది. పార్టీ పెట్టి ఇన్నిదినాలైన ఎన్నడు ఒక్కమాట సక్కగా మాట్లాడింది లేదు. వేదికనెక్కి మైకు దొరకగానే పూనకం వచ్చినవాడిలా ఊగుతూ, ఎవరో రాసిచ్చిన స్క్రిప్టులోని మాటల్ని ఎదాతధంగా అప్పగిస్తుంటడు. తనది కుటుంబ రాజకీయం కాదంటడు, అన్న నాగబాబుకు నరసాపురం ఎంపీ టికెట్ ఇస్తడు. తనది కుల రాజకీయం కాదంటడు, అనంతపురంలో ఇచ్చిన మాటని పక్కనపెట్టి తన సామాజికవర్గపు ఓట్లున్నచోట్లలో పోటీచేస్తడు. సామాజిక న్యాయంకోసం రాజకీయల్లోకి వచ్చినా అంటడు, తనకుమాత్రం రెండు సీట్లు తీసుకుంటడు. తాను తెలంగాణ, ఆంధ్ర రెండు ప్రాంతాల వాడినంటడు, ఆంధ్ర ప్రదేశ్ విడదీసినప్పుడు 11రోజులు అన్నం మానేసిన అంటడు. ఇలా తన ప్రసంగాల్లో ఏదో ఒకచోట తెలంగాణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్న పవన్ ను గాలివాటం మనిషిగానే తప్ప పూర్తిస్థాయి నాయకుడిగా ఆంధ్ర ప్రజలు లెక్కలోకి తీసుకుంటలేరు. పేరుకు జనసేన అయినా ఆయన వెంట అభిమానులు తప్ప పెద్ద సేన ఏదీ లేదన్నది ఆ పార్టీలోనే వినవస్తోన్న అభిప్రాయం. ధర్నాలు దీక్షల పేరుతో సమయం వృధా చేయటం తప్ప జనసేన పార్టీకి పూర్తిస్థాయి రాజకీయ రూపం కల్పించలేకపోయారని పటిష్టం చేయలేకపోయారన్నది జగమెరిగిన సత్యం. పవన్ పోకడ చూస్తుంటే ఎన్నికలను లక్కీ లాటరీగా భావిస్తున్నడని, గెలుపు తగిలితే తగిలింది లేకపోతే బ్యాక్ టు టాలీవుడ్ అన్న అభిప్రాయం ఆయనలోవుందని ఒకవైపు, జగన్ ఓట్లను చీల్చడంకోసం చంద్రబాబే పవన్ చేత పార్టీ పెట్టించాడనీ,అందుకోసం పవన్ కు భారీగా ప్యాకేజీలు అందుతున్నాయని మరోవైపు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాజశేఖరరెడ్డి మరణం తరువాత పార్టీని స్థాపించిన జగన్ 2014లో రాష్ట్ర విభజన తరువాత తన పార్టీని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికే పరిమితం చేసిండు. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 341 రోజులపాటూ 13 జిల్లాల్లో 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నడేకానీ, ఏనాడు తెలంగాణ రాష్ట్రంపై కానీ, తెలంగాణ నాయకులపై కానీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. అంతేకాకుండా ప్రభుత్వ వైఫల్యాలను జనం దృష్టికి తీసుకెళ్ళి వారి దగ్గరనుండి పాజిటీవ్ రెస్పాన్స్ ను సంపాధించిండు. దీనిని బట్టిచూస్తే ఈసారి జగన్ వైపు అనుకూల ఫలితం వచ్చేలా కనిపిస్తుంది.
ఇక, అరవై ఏండ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తెలంగాణ ప్రధాత కేసీఆర్ ను తీసుకుంటే... ఒంటిచేత్తో తెలంగాణ మహాపర్వతాన్ని పెకిలించి తెచ్చి ప్రజల కల నెరవేర్చిన కేసీఆరే నిజమైన బాహుబలి. ఢిల్లీ మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించడమేకాకుండా గత అయిదేళ్ళలో ఆదర్శ పాలన సాగించి, ఆసరా పించన్లతోనే కేసీఆర్ తన పాలన సుస్థిరం చేసుకున్నడు. ఇచ్చినమాట మరువకుండ గత ఫించన్లను 500 నుండి 2000లకు పెంచటమే కాదు వాటిని అమాంతం మళ్ళా పెంచటం లబ్దిదారుల్లో నమ్మకాన్ని రెట్టింపు చేసింది. ఈ పథకం ద్వారా కేసీఆర్ వృద్ధులకు ఇంటి పెద్ద కొడుకుగా మారిండు. రైతన్నలకు పెట్టుబడి రాయితీని నేరుగా వాళ్ళ బ్యాంకు ఖాతాల్లోకే బదిలీ చేయటం వల్ల ఖరీఫ్ రబీల్లో పంటల సాగుకోసం ప్రైవేట్ అప్పులు చేసే తిప్పలు సగానికిపైగా తప్పింది. ఈ మహత్తర పథకానికి రైతన్నలు హర్షం వ్యక్తం చేయటంతో కేంద్రంలోని బీజేపీ సైతం కాపీ కొట్టి తన ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది. అన్నదాతల ఆగ్రహం తప్పించుకోవటానికి కేసీఆర్ పథకాన్ని అడ్డం పెట్టుకుంది. కేసీఆర్ ప్రవేశపెట్టిన కేజీ టు పీజీ ఉచితవిద్య పేద కుటుంబాల్లోని విద్యార్థులకు వరంగా మారింది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద మధ్యతరగతి తల్లిదండ్రులకు ఎంతో తోడ్పాటుగా నిలుస్తున్నయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయా కుటుంబాల్లోని పెళ్ళీడు ఆడపిల్లలకు మేనమామగా మారి వారి పెళ్ళిళ్ళు చేయిస్తున్నట్టయ్యింది. పేదలకు డబుల్ బెడ్ రూం పథకం పూర్తిస్థాయిలో అమలు కాకపోయినా అట్టడుగు జనం కొందరికైనా సొంతింటికల నెరవేర్చింది. సంక్షేమ పథకాలుకాక అభివృద్ధి పథకాలు చూస్తే చాంతాడంత లిస్టుంది. మిషన్ కాకతీయతో చెరువుల పూడిక తీయించి సాగునీటి వసతులు మెరుగు పరచటం, మిషన్ భగీరథతో పట్టణాలు నగరాల్లో మంచినీటి ఎద్దడి నివారించటం, హరితహారం ద్వారా చెట్లను కోట్ల సంఖ్యలో నాటి పర్యావరణానికి పాటుపడటం వంటివి నిజంగా చాలా గొప్ప పనులు. వీటన్నింటిని చూసిన యావత్ భారత ప్రజలు రాజకీయాలకు అతీతంగా కేసీఆర్ ను అభినందించిర్రు, దేశంలోనే అత్యుత్తమ సీఎంగా ఎంపికచేసిర్రు. ఇన్ని కోణాల్లో కేసీఆర్ గురించి జనం జేజేలు పలుకుతుంటే, పక్క రాష్ట్రపోళ్ళు మాత్రం తెలంగాణ మీదనే ఏడుస్తున్నరు.
అయితే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ కూడా చంద్రబాబుపై వ్యాఖ్యలు చేయగాలేంది,చంద్రబాబు చేస్తే తప్పేంటి అని అనేవాళ్లు లేకపోలేదు. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొన్నడు. 60 ఏళ్ళనుండి హైదరాబాదును తానే అభివృద్ధి చేస్తున్నానని చెప్పుకోవడంతోపాటు ప్రాంతాల ప్రస్థావన తెచ్చి విద్వేషాలు రగిలేలా రెచ్చగొట్టిండు. మరోవైపు బాలకృష్ణ కూడా తన ప్రచారంలో కూడా ఇదే పద్ధతిని కొనసాగించిండు. దాంతో కేసీఆర్ తన ప్రసంగాల్లో చంద్రబాబు ప్రస్తావన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అనుకున్నట్టుగానే కేసీఆర్ భారీ మెజారిటీతో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యిండు. ఆరోజు పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ''తెలంగాణలో విద్వేషాలు రగిలేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు రానున్న ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా'' అన్నడు. అనడమైతే అన్నడు కానీ ఇప్పటివరకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో కేసీఆర్ జోక్యం చేసుకోలేదు. ఈ విషయం రెండు రాష్ట్రాల ప్రజలందరికి తెలుసు. అయితే, తన ఐదేళ్ళ పాలనలో ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన అభివృద్ధిని ప్రజల ముందుకు చెప్పే ధైర్యం చేయని చంద్రబాబు, గంటకో మాట మారుస్తూ ప్రజల్ని రెచ్చగొడుతున్న పవన్ లు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ మాటను అడ్డు పెట్టుకొని బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నరు.
ఈ ఆంధ్ర నేతల వికృత చేష్టలు చూస్తున్న తెలంగాణ ప్రజానీకం ''మా తెలంగాణ విషయం పక్కన పెట్టి, మీది మీరు చూసుకోండి సారులు'' అంటూ ముక్తకంఠంతో హితబోధ చేస్తున్నరు.
---ప్రణయ్‌రాజ్ వంగరి



  1. వెబ్ ఆర్కైవ్ లో పేజీ లంకె (ఈపేపర్)
  2. వెబ్ ఆర్కైవ్ లో పేజీ లంకె (వెబ్ పేపర్)