Wednesday, August 29, 2018

యువరాజునవుతాను... (మనం ఆదివారం సంచిక మకుటంలో 26.08.2018)

రాఖీ పండుగ... ఈ పేరు వినగానే నాముఖం నిండు పున్నమి ఆకాశం అవుతుంది... ఎందుకంటే రాఖీ అనంగానే మా అక్క గుర్తొస్తుంది చెల్లి నవ్వు వినిపిస్తుంది... ఈ రక్తసంబంధ దృశ్యం నా ఒక్కడికేం పరిమితం కాదు... ఇది హృదయాల సవ్వడి సందర్భం... అనురాగాల సంగమ తీరం...

నేను, కాంక్రీట్ జంగిల్‌లో ఎడారిని... జానెడు పొట్ట మూపురాన్ని నడి వీపున మోసుకు తిరుగుతున్న ఒంటెని... ఎప్పుడో ఒక విరామ శ్రమలో ఎండమావి వైపు ఆశగా చూస్తూ ఆకుపచ్చని నా పల్లె బతుకును కలగంటుంటాను... ఏడాదికొకసారి అదిగో అటువంటి తధాస్థు రోజున నా ఆశ మొలుస్తుంది... అంతకు ముందే... నా దేహమంతా అనురాగ వాన కురుస్తుంది... అవును మా అక్క రెక్కలు కట్టుకొని వాలితే పల్లెలో మా రంగు ముగ్గు వాకిలి కనపడుతుంది... చిలుకల నవ్వుతో మా చెల్లి చేరితే మొన్నమొన్ననే నాటిన మా ఊరి వరి పొలాలు కళ్ళముందు కదలాడుతాయి... ఊరి పొలం నుండి గోరటి వెంకన్న పల్లెపాట నాదాకా వినిపిస్తుంటుంది... ఒక చేత్తో రాఖీ మరో చేత్తో మిఠాయి, వాళ్ళ నిండు గుండె దోసిళ్ళతో ప్రేమ పూర్వక దీవెన వహ్... ఇంతకన్నా పండుగేముంది...

ఒకరి గుండె చెరువు నిండుతుంది, ఇంకొకరి మనసు బావి పొంగుతుంది, ఇంకో చోట సంతోష జలపాతం దూకుతుంది, మా ఇల్లే కాదు పట్నాలు నగరాల్లోని అన్నదమ్ముల ఇళ్ళ మత్తడి నుండి ఆప్యాయతా నదీ ప్రవాహాలవుతాయి... కాలంతో పోటీపడి నిమిషాలు గంటలను పనితో కొలుస్తుంటానని గడియారం తన నాడీ స్పందనతో ఏడాదంతా నా దండ చేతిపై సవ్వడి వినిపిస్తుంది... కానీ ఎందుకో... రాఖీ సమీపిస్తుండగానే గడియారం మోము వాడిపోతుంది... రాఖీ పండుగ నాడు నా రక్త బిందువులు కట్టే కంకణాల మధ్య గడియారం బిక్క మొహమేస్తుంది...

నా చేతికి కట్టే రక్షా బంధనం కోసం అక్కచెల్లెళ్ళ లోకకళ్యాణపు విశ్వశాంతి యాగక్రతువు అప్పటికి వారంరోజుల ముందే మొదలై ఉంటుంది... వాళ్ళ ఇల్లు పిల్లలు సంసారం ఉద్యోగాలు వృత్తి వ్యాపారాలు మెట్టినింటి గడపకు అప్పజెప్పే ప్రణాళికలో మునిగి తేలి ఉంటారు...

చెల్లెలు కట్టే రాఖి పొద్దు తిరుగుడు రెక్కల్లా ఉంటుంది, అక్క తెచ్చే రాఖీ ముద్దబంతి పువ్వులా ఉంటుంది... 

నా చేతికి రాఖీ మొలిచాక పట్టాభిషేక యువరాజునవుతాను... నేను బహుకరించే కానుకతో వాళ్ళ మనసులో ఆనందం తాండవిస్తుంటుంది... ఆ సంగీతం ఈ సోదరునికే వినిపిస్తుంది... వాళ్ళు నాతో ఉన్న ధైర్యంతో బాల్యాన పోగొట్టుకున్న రాజ్యాన్ని ఒక్కసారిగా గెలుచుకొస్తాను... జగత్ విజేత అలెగ్జాండర్‌ను అన్న అనే పిలుపుతో కట్టిపడేసిన రోజు కదా... అందుకే ఇంత బలమైన బాంధవ్యం... అక్కా చెల్లి ఉన్నంతసేపు మా బాల్య స్మృతులు గుభాళిస్తుంటాయి...
ఎప్పుడన్నా... తోబుట్టువు రాఖీతో పలకరించకపోతే... నా కళ్ళు కన్నీటి సంద్రాలవుతాయి... పోస్ట్‌లోనైనా అన్నా తమ్ముడూ అన్న పిలుపు వినిపించకుంటే... నా గుండెచెవులు వీధికి వేళాడుతుంటాయి...

రాఖీ అనే రెండక్షరాల రక్షా రేఖ కోసం... తోబుట్టువుల ఆశీర్వచనం కోసం చెల్లెళ్ళు అక్కల వద్దకే నడిచే సోదరులు కూడా ఉంటారు... కులమతాలకతీతంగా కంటికి కనిపించని దేవుడి రూపాన్నే చూపుల్లో నిలుపుకొని కొండాకోన దాటి దర్శించుకునే మనకు... కళ్ళముందు తిరుగాడే తోబుట్టువు దీవెన దైవ శక్తి సమానమే... ప్రహరీ అడ్డు గోడలు మందిర్ మసీదు చర్చ్‌లకేకానీ దేవుడికి కాదు... అలానే సోదరి ప్రేమకు ఆశీర్వాద దీవెనకు కులాలు అడ్డురావు... నీ ముంజేతిని ముందుకు చాపి చూడు, అన్నా చూడు తమ్ముడూ చూడు అంటూ ఒక మసీదు రాఖీ కడుతుంది ఒక చర్చ్ దీవిస్తుంది... అందుకే... లేనోడు ఉంటాడేమో కానీ సోదరి లేనోడెవడూ ఉండకూడదు...

ప్రణయ్‌రాజ్ వంగరి,
తెలుగు వికీపీడియా వ్యాసకర్త


  1. వెబ్ ఆర్కైవ్ లో పేజీ లంకె (ఈపేపర్)
  2. వెబ్ ఆర్కైవ్ లో పేజీ లంకె (వెబ్ పేపర్)