Sunday, October 07, 2018

బతుకమ్మా... బతకవమ్మా (మనం ఆదివారం సంచిక మకుటంలో 07.10.2018)




విశిష్టత
తెలంగాణ సాంస్కృతిక ప్రతీక బతుకమ్మ. రంగురంగుల పూల సమాహారమే బతుకమ్మ. కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాల విశేషణాల వంటి తొమ్మిది రకాల భావోద్వేగాల కలగలుపే ఈ తొమ్మిది రోజుల బతుకమ్మ. ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటూ, తెలంగాణ అస్థిత్వాన్ని నలుదిశలా చాటే దశాబ్ధాల పండుగ బతుకమ్మ. బానిసత్వపు సంకెళ్లను తెంచుకుని బలిపీఠం ఎక్కిన ఎందరో మహా తల్లుల కోసం బతుకమ్మా అంటూ బతకవమ్మా అంటూ పూలను సేకరించి నీటిలో నిమ్మజ్జనం చేసే ప్రక్రియే బతుకమ్మ. బ్రతుకు దుర్బరమై పెత్తందారీలా ఆటలో నలిగిపోయిన ఎందరో స్త్రీలను తలుచుకుంటూ, రంగురంగుల పువ్వులే వాళ్ళ ప్రతీకలుగా పూజించే పండుగ ఈ బతుకమ్మ.

అంతర్గత మూలాలు
తెలంగాణ ప్రకృతి దృశ్యమంతా ఈ పండుగ సాంప్రదాయంలో కనిపిస్తుంది. వర్షాకాలం అయిపోయి శీతాకాలం మొదలయ్యే ఆ సమయం వర్షాలతో పంటలు పండి, చెరువులు నిండి, చెట్లనిండా పూలు ఆరుబయట పూసి ఉంటాయి. ముఖ్యంగా తంగేడు, గునుగు పూలు ప్రత్యేకం. బంతి వర్ణాలు చేమంతి సోయాగాలనీ చూడగలం. అలాగే జొన్న పంటలు సీతాఫలాలు గుడ్లు తేలి రసవత్తరంగా ఉంటాయి. పంటలు తలలూపుతూ పచ్చికలతో ఉన్న సమయాన రంగురంగుల పూల నడుమ బతుకమ్మను జరుపుకోవడం తెలంగాణ సంస్కృతిలో గొప్ప విషయం. ఎంగిలిపూల బతుకమ్మ, అటుకుల బతకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానే బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, సద్దులబతుకమ్మ అంటూ తొమ్మిది రోజుల బతుకమ్మలో ఎన్నో సైంటిఫిక్ అంశాలు, పిల్లలూ యువకులు బలిష్టంగా ఉండే తిండిపదార్ధాల తయారీలు అంతర్గతంగా దాగుంటాయి. తొమ్మిది రోజుల నైవేద్యాలలో అన్నీ సహజ సిద్ధంగా దొరికే సజ్జలు, జొన్నలు, వరి, గోధుమ, నెయ్యి, పాలు వగైరా పిండిపదార్ధాలతో నైవేద్యాలు సమర్పిస్తారు.

బతుకమ్మ ఆట
రాగి పళ్ళెంలో పూలను వలయాకారంగా కుటుంబసభ్యులంతా కలిసి పేరుస్తారు. దీనిద్వారా వారిలో బంధాలు ఇంకా గట్టిపడతాయి. అలంకరించిన బతుకమ్మలను అందరూ ఒకచోటపెట్టి, చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు.  స్త్రీలందరూ బతుకమ్మను తలపై మోస్తూ ఊరేగింపుగా వెళ్ళి ఊరి చెరువులో వదిలి బతుకమ్మ పాటలను పాడుతూ వెంట తెచ్చుకున్న రొట్టె  పంచదారలను ప్రసాదంలా ఇస్తూ ఇళ్లకు చేరతారు. మొదటి ఎనమిది రోజులు పెళ్లికాని ఆడపిల్లలు బొడ్డెమ్మలను పెట్టి బతుకమ్మ ఆడతారు. తెలంగాణ మాండలికంలో సాగే ఈ బతుకమ్మ పాటలు ఎంతో పేరు ప్రఖ్యాతిగాంచాయి.

ప్రభుత్వ తోడ్పాటు
తెలంగాణ కోసం బతుకమ్మను ఊరేగింపు చేసుకొని ఉద్యమాన్ని నడిపిన తీరు, న భూతో న భవిష్యత్. ప్రకృతిని ఆరాధించే తెలంగాణ పండుగ బతుకమ్మను, తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్ర పండుగగా ప్రకటించి దేశదేశాలు తెలిసేలా వేడుకలు జరుపుతున్న తెలంగాణ ప్రభుత్వం, ఎన్నో వనరులను ఖర్చుపెడుతూ బతుకమ్మ పండుగకు ప్రపంచ వైభోగం తీసుకొచ్చింది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో మహా బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నది.  రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 35 వేల మంది మహిళలను ఈ వేడుకల్లో భాగస్వామ్యం చేయడమేకాకుండా, 19 రాష్ట్రాలకు చెందిన కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్నది. 2017 అక్టోబర్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మంగా ‘మహా బతుకమ్మ’ ఉత్సవాలు నిర్వహించి, ఎల్బీ స్టేడియంలో ఏర్పాటుచేసిన 20 అడుగుల భారీ బతుకమ్మ చుట్టూ 9292 మంది తెలంగాణ మహిళలు మరియు 40 దేశాలకు చెందిన 200 మంది విదేశీ వనితలతో బతుకమ్మను ఆడించడం జరిగింది.


ఈ ఏడాది కూడా రూ.20 కోట్లతో విశ్వవ్యాప్తంగా బతుకమ్మను నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుంది. అందులో ప్రతి జిల్లాకు రూ.15 లక్షలు, విదేశాల్లో పండుగ నిర్వహణకు రూ.2 కోట్లు కేటాయించారు. సద్దుల బతుకమ్మ రోజున లేజర్ షో, ఫైర్‌వర్క్స్, కల్చరల్ కార్నివాల్ మరియు ఐటీ కంపెనీల సహకారంతో నగరంలో పూల శకటాల ప్రదర్శనలు ఏర్పాటుచేస్తున్నారు. అంతేకాకుండా మొదటిసారిగా 12 ఏండ్లలోపు ఉండే బాలికలతో అక్టోబర్ 7 నుంచి 9 వరకు బొడ్డెమ్మ పండుగ... 1000 మంది కంటిచూపు లేని మహిళలు, బధిరులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా హైటెక్స్‌లో బతుకమ్మ నిర్వహణ... 50 మంది పారామోటరింగ్ ద్వారా ఆకాశంలో బతుకమ్మ హరివిల్లు కనిపించేలా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. 12 దేశాల నుంచి ప్రత్యేకంగా పూలు తెప్పించి బతుకమ్మలను అలంకరిస్తున్నారు. అలాగే 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకు రవీంద్రభారతిలో బతుకమ్మ ఫిల్మోత్సవం, 55 దేశాల ఫొటోగ్రాఫర్ల ఫొటో ప్రదర్శనతో నెలరోజులపాటు ఆర్ట్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఇంతేకాకుండా విదేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాల సహకారంతో  అమెరికా, సింగపూర్, పోలండ్,  ఆస్ట్రేలియా, డెన్మార్క్ లాంటి దేశాల్లో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం కొత్తగా పల్లెప్రజల్లో ఉత్సాహం నింపేందుకు ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలను పంపిణీచేస్తూ, వారి బతుకుల్లో పండుగలని నింపుతున్నారు. మరోసారి ఆ పర్వదినాన్ని జరుపుకునేందుకు మనమందరం సిద్ధమవుదాం.

  1. వెబ్ ఆర్కైవ్ లో పేజీ లంకె (ఈపేపర్)