Monday, December 23, 2024

రోజుకో వ్యాసం.. ప్రణయ విన్యాసం (ఈనాడు, యాదాద్రి భువనగిరి జిల్లా, 21.12.2024)


 ‘వికీపీడియా’… ప్రపంచ వ్యాప్తంగా వందలాది భాషలు, లక్షలాది వ్యాసాలతో అంతర్జాలంలో అలరారుతోంది. తెలుగు భాషలో విజ్ఞానాన్ని పంచేందుకు కొందరు తెలుగు వికీపీడియన్ల కృషితో రూపొందుతున్న స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం.

యాదాద్రి జిల్లా మోత్కూరులోని చేనేత కార్మిక కుటుంబానికి చెందిన ప్రణయ్‌రాజ్ వంగరి తెలుగు వికీపీడియాలో 365 రోజుల్లో 365 వ్యాసాలు రాసి ప్రపంచ రికార్డు సాధించారు.

తెలుగు వికీపీడియాలో 7,903 వ్యాసాలు

2013 మార్చి 8న వికీపీడియాతో లాగిన్ అయ్యారు. తొలుత తెలుగు నాటకరంగానికి సంబంధించిన వ్యాసాలు రాయడం ప్రారంభించారు. అలా అనేక రంగాలను ఎంచుకుని వ్యాసాలు రాస్తూ తొలుత వందరోజుల్లో వందవ్యాసాలు రాశారు. ఇలా.. 365 వ్యాసాలు రాసి ప్రపంచ రికార్డు సాధించారు. 2024 నవంబరు 243 వేల రోజుల్లో 7,903 వ్యాసాలను రాసి మరో సరికొత్త రికార్డును సాధించారు.

తెవికీ తెలంగాణ సాంస్కృతిక దర్శిని ప్రాజెక్టులో

తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ, వికీ మీడియా ఫౌండేషన్లు సంస్థాగత భాగస్వామ్యాన్ని మరింతగా పెంచడానికి తెలంగాణలోని సాంస్కృతిక వారసత్వాన్ని డిజిటలైజ్ చేయడంలో, ఉచిత విజ్ఞానాన్ని ప్రోత్సహించడంలో క్రియాశీల సహకారాన్ని ప్రారంభించేందుకు తెవికీ తెలంగాణ సాంస్కృతిక దర్శిని అనే ప్రాజెక్టును రూపొందించారు.

 2014 నుంచి 2024 వరకు తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన సాంస్కృతిక ఫొటోలు, వీడియోలను.. భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన తెలంగాణ నేపథ్య, చారిత్రక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన 70 పుస్తకాలను భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో చిత్రించిన తెలంగాణ తేజోమూర్తుల తైలవర్ణ చిత్రాలను పబ్లిక్ డొమైన్ లోకి విడుదల చేయడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం.

గత ఎనిమిదేళ్లుగా తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖలో ప్రత్యక్ష అనుబంధాన్ని కలిగి ఉన్న ప్రణయ్‌రాజ్ ఈ ప్రాజెక్టుకు వికీపీడియన్ గా ఇన్ రెసిడెన్స్ గా పనిచేశారు. ఈ ప్రాజెక్టులో ఏడువేల ఫొటోలను (తగిన పేరు, తెలుగు వివరణ, వర్గీకరణ, ఇతర అవసరమైన మెటాడేటాతో కలిపి), పుస్తకాలను, తైలవర్ణ చిత్రాలను ప్రణయ్‌రాజ్ వికీపీడియా కామన్స్లోకి అప్లోడ్ చేశారు. వీటిని ఎవరైనా కామన్స్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

వెంకయ్యనాయుడి ప్రశంసలు

తెలుగుకు సముచిత స్థానం కల్పిస్తూ.. తెలుగు వికీపీడియాలో ప్రపంచ రికార్డు సాధించిన ప్రణయ్రాజ్ను నాడు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎక్స్ లో  అభినందించారు. అప్పటి తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఎక్స్ లో అభినందించి తన కార్యాలయానికి పిలిపించుకుని సన్మానించారు. వికీపీడియా సంస్థ ప్రోగ్రామ్ ఆఫీసర్ అసఫ్ హైదరాబాద్ లో ప్రణయ్‌రాజ్ ను అభినందిస్తూ ప్రపంచ రికార్డుగా ప్రకటించడం విశేషం. ఈనెల 19 నుంచి 29 వరకు నిర్వహించనున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ లోని తెలుగు వికీపీడియా స్టాల్ ను సంప్రదించాలని ప్రణయ్‌రాజ్ కోరారు.


 

 




  1. ఒరిజినల్ పేజీ లంకె (వెబ్ పేపర్)
  2. వెబ్ ఆర్కైవ్ లో పేజీ లంకె (వెబ్ పేపర్)

 

 

No comments:

Post a Comment