Saturday, December 29, 2018

365 రోజులు 365 వ్యాసాలు (ఈనాడు ఈతరం, 29.12.2018)

నెట్టింట్లోకెళ్లిన వాళ్లెవరైనా.. పేరున్న వ్యక్తి, ఊరు, దేశం గురించి తెల్సుకోవాలంటే వికీపీడియా తెరవాల్సిందే. ఇక్కడ మనం వెతుకుతున్న సబ్జెక్టునే గమనిస్తాం గానీ...ఈ సమాచారం అంతా ఎవర్రాశారనే విషయం మాత్రం పట్టించుకోం. అలా వీటిని రాస్తున్నదెవరో ఆరాతీస్తే... ఎంతో మంది ఔత్సాహికులు కన్పిస్తారు. వారిలో 365 రోజుల పాటు ప్రతిరోజు ఓ వ్యాసం తెలుగు వికీపీడియాలో రాసి వరల్డ్‌ రికార్డు సాధించాడు తెలంగాణకు చెందిన ప్రణయ్‌రాజ్‌ వంగరి.

365 రోజులు 365 వ్యాసాలు
వెయ్యిరోజుల్లో వెయ్యి వ్యాసాలు రాయాలని రాస్తున్నా. ఈ రోజు 843 వ్యాసం రాయాలి. వెయ్యి తర్వాతా ఆపను. నేను రాసింది పదిమంది చదివి ఫోన్లు చేస్తుంటే ఆనందం. అదే నా ఇంధనం. 365 రోజుల రికార్డు సాధించాక ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుగారు నా గురించి ట్వీట్‌ చేశారు. తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది.
365 రోజులు 365 వ్యాసాలు





















ప్రణయ్‌రాజ్‌ గతంలో మనలాగే వికీపీడియాలో సమాచారం కోసం వెతికేవాడు. ఇంగ్లీషులో సమాచారం దొరికినపుడు.. తెలుగులో ఎందుకు లేదని వేదన చెందేవాడు. ఆ ఆవేదన అతనికి ఓ మార్గనిర్దేశనం చేసింది. ఆ మార్గంలో ప్రయాణించి లక్ష్యం చేరాడు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన ప్రణయ్‌ స్కూల్‌లో డ్యాన్సు, పాటలు పాడటం చేసేవాడు. ఎవరేం మాట్లాడినా.. నోట్సు రాసుకోవటం అతనికి అలవాటు. తెలుగంటే ప్రత్యేకాభిమానం. బతుకమ్మ, అప్పగింతల పాటలు వాళ్లమ్మ బాగా పాడేది. ఆ వాతావరణంలో పెరిగిన తనకు సినిమాల్లోకి రావాలనే కోరిక పెరిగింది. సినిమాల్లోకి వెళ్లాలంటే థియేటర్‌ ఆర్ట్స్‌ చేస్తే బావుంటుందని మిత్రుడు సలహా ఇచ్చాడు. దీంతో పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయంలో ఎమ్‌.ఎ.ఆర్ట్స్‌లో చేరాడు. ఇక్కడ చదువుకొనేటప్పుడు ‘నాటకాలకు సంబంధించిన సమాచారం వికీపీడియాలో ఎందుకు లేద?’ని గురువును ప్రశ్నించాడు. ‘‘ఎవరో ఒకరు రాస్తే కదా ఉండేది. నువ్వే రాయి.’’ అని గురువుగారు పెద్దిరామారావు చెప్పిన మాటే తనలో ఆసక్తిని పెంచింది. ఇంకేమీ ఆలోచించకుండా వికీపీడియన్‌గా మారాడు. మొదట నాటకరంగం గురించే  వ్యాసాలు మొదలుపెట్టాడు.
పెళ్లిరోజూ ఓ వ్యాసం
ప్రణయ్‌ వికీపీడియాలో వ్యాసాలు రాసే తరుణంలో.. ‘రాయట‌మెందుకూ.. నీకేం లాభం! డబ్బులు రాని పనులు చేయటం టైం వేస్టు’ లాంటి మాటలు కొందరు అతని చెప్పారు. అవేమీ పట్టించుకోలేదు. మొదట్లో పుస్తకాల్లోని విషయం రాసి రచయిత పేరు రాసేవాడు. ఆ తర్వాత అందులోని విషయం చెప్పి ఫలానా రిఫరెన్సు అని రాసేవాడు. అదే సమయంలో ‘100 వికీడేస్‌’ అనే కాన్సెప్టును వికీపీడియా సంస్థ ప్రారంభించింది. అంటే వందరోజుల్లో వంద వ్యాసాలు రాయాల్సి ఉంటుంది. అప్పటికే తెలుగులో పవన్‌ సంతోష్‌, తన చెల్లెలు మీనా గాయత్రి 100 వికీడేస్‌లో విజయం సాధించారు. వారిచ్చిన స్ఫూర్తితో తనూ మొదలుపెట్టాడు. రాస్తూనే ఉన్నాడు. సరిగ్గా 96 వరోజు వ్యాసం రాసేసమయంలో అతనికి 365 రోజులు ఎందుకు రాయకూడదనిపించింది. అలాగే కొనసాగించాడు. తెలంగాణ కళలు, నాటకాలు, ఇక్కడి ప్రాంతాలు, సినిమాలు, సామాజిక పరిస్థితులపై వ్యాసాలు రాశాడు. తెలంగాణ యువనాటకోత్సవం రోజున ప్రణయ్‌ పెళ్లి. బరాత్‌ సమయంలో వ్యానులో కూర్చొని ఓ వ్యాసం రాశాడు. 2016 సెప్టెంబరు 8న ప్రారంభించి 2017 సెప్టెంబరు 7న 365 వ్యాసాలు పూర్తిచేశాడు. అదే వరల్డ్‌ రికార్డ్‌. దీంతో వికీపీడియా సత్కారం అందుకున్నాడు.
- రాళ్లపల్లి రాజావలి




  1. వెబ్ ఆర్కైవ్ లో పేజీ లంకె (ఈపేపర్)
  2. వెబ్ ఆర్కైవ్ లో పేజీ లంకె (వెబ్ పేపర్)

Monday, November 19, 2018

అలుపెరుగని ప్రణయ్‌ (వెలుగు పత్రిక)



అలుపెరుగని ప్రణయ్‌
అలుపెరుగని ప్రణయ్‌
హైదరాబాద్, వెలుగు: వీరుడి ఆత్మకథనో, ఉద్యమకారుడి గాథనో, సినిమా హీరో గురించో.. ఇలా నచ్చినవాళ్ల గురించి తెలుసుకోవాలి అనుకునేవాళ్లు చాలామందే ఉంటారు. ఇప్పుడు ఎవరి గురించి ఏం తెలుసుకోవాలన్నా నెట్‌లో సెర్చ్‌ చేస్తున్నారు. వెంటనే పూర్తి బయోడేటా చెప్పేస్తుంది వికీపీడియా. కానీ అందులో చాలా వ్యాసాలు ఇంగ్లీషులోనే ఉండటం వల్ల కొందరు చదవలేకపోతున్నారు. అందరూ ఈ సమస్యను తేలిగ్గా తీసుకుంటే ప్రణయ్‌రాజ్‌ మాత్రం చాలెంజ్‌గా తీసుకున్నాడు. తెలుగులో వ్యాసాలు రాయడం మొదలుపెట్టాడు. సంవత్సరం పాటు నిర్విరామంగా రాసి ప్రపంచ రికార్డు సాధించాడు. ఈ మధ్యనే 800వ్యాసాల చాలెంజ్‌ పూర్తిచేశాడు.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన ప్రణయ్‌‌రాజ్ వంగరి నాటక రంగంలో ఎంఫిల్ చేసి రవీంద్రభారతిలోని ప్రివ్యూ థియేటర్‌‌లో కో-ఆర్డినేటర్‌‌గా పని చేస్తున్నాడు. ఎంఫిల్ చేస్తున్న సమయంలో నాటక రంగం గురించి తెలుసుకోవాలని నెట్‌‌లో సెర్చ్ చేశాడు. కానీ అయనకు తెలుగులో సమాచారం దొరకలేదు. తనలాగే చాలామంది ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని వికీపీడియాలో తెలుగులో వ్యాసాలు రాయాలని నిర్ణయించుకున్నాడు. అలా 2013లో వ్యాసాలు రాయడం మొదలుపెట్టారు. మొదట తనకు తెలిసిన సమాచారాన్ని వికీపీడియా సైట్‌‌లో రాసేవాడు. చాలామంది ఆ వ్యాసాలు చదివి ప్రశంసించారు. ఆ తర్వాత ‘తెలుగు వికీమీడియా ఫౌండేషన్’ సహకారంతో 2016లో ఇటలీలో జరిగిన వికీమీడియా కాన్ఫరెన్స్‌‌కి వెళ్లాడు. అక్కడ వందరోజుల వికీపీడియా చాలెంజ్ గురించి తెలుసుకున్నాడు. అలా మొదట వందరోజుల చాలెంజ్ తీసుకుని వ్యాసాలు రాశాడు. తర్వాత సంవత్సరం చాలెంజ్ తీసుకున్నాడు. 365రోజులు ప్రతి రోజూ ఒక వ్యాసం రాసి ప్రపంచ రికార్డు సాధించాడు. ఇందుకుగాను ఆయన వికీపీడియా సృష్టికర్త జిమ్మీవేల్స్ నుంచి ఇటలీలో అవార్డు అందుకున్నాడు. అంతేకాకుండా తెలంగాణ ఐటీ శాఖ నుంచి కూడా అవార్డు అందుకున్నాడు. ప్రణయ్‌‌ రాసే వ్యాసాల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, కళలు, ప్రముఖులు, ప్రదేశాల సమాచారమే ఎక్కువగా ఉంటుంది.
టార్గెట్‌ 1000
ప్రణయ్‌ 2017సెప్టెంబర్ వరకు 365వ్యాసాలు రాశాడు. ఆ తర్వాత 800 వ్యాసాల చాలెంజ్ తీసుకుని ఈ నెల 16న పూర్తిచేశాడు. ఇప్పుడు వెయ్యి వ్యాసాల లక్ష్యం పెట్టుకుని రాస్తున్నాడు. అయితే తెలుగులో వ్యాసాలు రాయడమంటే మనకు తెలిసిన సమాచారంతో నచ్చిన విధంగా రాస్తే కుదరదు. ఇందుకు కొన్ని నియమాలున్నాయి. ఎంచుకున్న అంశం ప్రజలకు ఉపయోగపడేదై ఉండాలి. ఒక వ్యక్తి గురించి రాస్తుంటే అది కేవలం ఇన్ఫర్మేషన్‌గా మాత్రమే ఉండాలి కానీ, పొగిడినట్టుగా ఉండకూడదు. రాసే అంశం గురించి వార్తాపత్రికల్లో, వెబ్‌సైట్లలో, అథెంటికేషన్ పొందిన పుస్తకాల్లో పొందుపర్చిన పదాల ఆధారంగానే రాయాలి. ‘365రోజుల చాలెంజ్ సమయంలో నా పెళ్లి కుదిరింది. పెళ్లి రోజు కూడా ఒక వ్యాసం రాసి నా భార్య చేత కూడా తెలుగు వికీపీడియాలో లాగిన్ చేయించాను. తెలంగాణ గురించి ఏ సమాచారం కావాలన్నా తెలుగు వికీపీడియాలో దొరకాలనే లక్ష్యంతోనే రాస్తున్నా’ అంటున్నాడు ప్రణయ్‌రాజ్‌ వంగరి.

(వి6 వెలుగు పత్రికలో నా గురించిన వ్యాసం... శనార్తులు అంజు గారు...)


Sunday, October 07, 2018

బతుకమ్మా... బతకవమ్మా (మనం ఆదివారం సంచిక మకుటంలో 07.10.2018)




విశిష్టత
తెలంగాణ సాంస్కృతిక ప్రతీక బతుకమ్మ. రంగురంగుల పూల సమాహారమే బతుకమ్మ. కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాల విశేషణాల వంటి తొమ్మిది రకాల భావోద్వేగాల కలగలుపే ఈ తొమ్మిది రోజుల బతుకమ్మ. ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటూ, తెలంగాణ అస్థిత్వాన్ని నలుదిశలా చాటే దశాబ్ధాల పండుగ బతుకమ్మ. బానిసత్వపు సంకెళ్లను తెంచుకుని బలిపీఠం ఎక్కిన ఎందరో మహా తల్లుల కోసం బతుకమ్మా అంటూ బతకవమ్మా అంటూ పూలను సేకరించి నీటిలో నిమ్మజ్జనం చేసే ప్రక్రియే బతుకమ్మ. బ్రతుకు దుర్బరమై పెత్తందారీలా ఆటలో నలిగిపోయిన ఎందరో స్త్రీలను తలుచుకుంటూ, రంగురంగుల పువ్వులే వాళ్ళ ప్రతీకలుగా పూజించే పండుగ ఈ బతుకమ్మ.

అంతర్గత మూలాలు
తెలంగాణ ప్రకృతి దృశ్యమంతా ఈ పండుగ సాంప్రదాయంలో కనిపిస్తుంది. వర్షాకాలం అయిపోయి శీతాకాలం మొదలయ్యే ఆ సమయం వర్షాలతో పంటలు పండి, చెరువులు నిండి, చెట్లనిండా పూలు ఆరుబయట పూసి ఉంటాయి. ముఖ్యంగా తంగేడు, గునుగు పూలు ప్రత్యేకం. బంతి వర్ణాలు చేమంతి సోయాగాలనీ చూడగలం. అలాగే జొన్న పంటలు సీతాఫలాలు గుడ్లు తేలి రసవత్తరంగా ఉంటాయి. పంటలు తలలూపుతూ పచ్చికలతో ఉన్న సమయాన రంగురంగుల పూల నడుమ బతుకమ్మను జరుపుకోవడం తెలంగాణ సంస్కృతిలో గొప్ప విషయం. ఎంగిలిపూల బతుకమ్మ, అటుకుల బతకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానే బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, సద్దులబతుకమ్మ అంటూ తొమ్మిది రోజుల బతుకమ్మలో ఎన్నో సైంటిఫిక్ అంశాలు, పిల్లలూ యువకులు బలిష్టంగా ఉండే తిండిపదార్ధాల తయారీలు అంతర్గతంగా దాగుంటాయి. తొమ్మిది రోజుల నైవేద్యాలలో అన్నీ సహజ సిద్ధంగా దొరికే సజ్జలు, జొన్నలు, వరి, గోధుమ, నెయ్యి, పాలు వగైరా పిండిపదార్ధాలతో నైవేద్యాలు సమర్పిస్తారు.

బతుకమ్మ ఆట
రాగి పళ్ళెంలో పూలను వలయాకారంగా కుటుంబసభ్యులంతా కలిసి పేరుస్తారు. దీనిద్వారా వారిలో బంధాలు ఇంకా గట్టిపడతాయి. అలంకరించిన బతుకమ్మలను అందరూ ఒకచోటపెట్టి, చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు.  స్త్రీలందరూ బతుకమ్మను తలపై మోస్తూ ఊరేగింపుగా వెళ్ళి ఊరి చెరువులో వదిలి బతుకమ్మ పాటలను పాడుతూ వెంట తెచ్చుకున్న రొట్టె  పంచదారలను ప్రసాదంలా ఇస్తూ ఇళ్లకు చేరతారు. మొదటి ఎనమిది రోజులు పెళ్లికాని ఆడపిల్లలు బొడ్డెమ్మలను పెట్టి బతుకమ్మ ఆడతారు. తెలంగాణ మాండలికంలో సాగే ఈ బతుకమ్మ పాటలు ఎంతో పేరు ప్రఖ్యాతిగాంచాయి.

ప్రభుత్వ తోడ్పాటు
తెలంగాణ కోసం బతుకమ్మను ఊరేగింపు చేసుకొని ఉద్యమాన్ని నడిపిన తీరు, న భూతో న భవిష్యత్. ప్రకృతిని ఆరాధించే తెలంగాణ పండుగ బతుకమ్మను, తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్ర పండుగగా ప్రకటించి దేశదేశాలు తెలిసేలా వేడుకలు జరుపుతున్న తెలంగాణ ప్రభుత్వం, ఎన్నో వనరులను ఖర్చుపెడుతూ బతుకమ్మ పండుగకు ప్రపంచ వైభోగం తీసుకొచ్చింది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో మహా బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నది.  రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 35 వేల మంది మహిళలను ఈ వేడుకల్లో భాగస్వామ్యం చేయడమేకాకుండా, 19 రాష్ట్రాలకు చెందిన కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్నది. 2017 అక్టోబర్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మంగా ‘మహా బతుకమ్మ’ ఉత్సవాలు నిర్వహించి, ఎల్బీ స్టేడియంలో ఏర్పాటుచేసిన 20 అడుగుల భారీ బతుకమ్మ చుట్టూ 9292 మంది తెలంగాణ మహిళలు మరియు 40 దేశాలకు చెందిన 200 మంది విదేశీ వనితలతో బతుకమ్మను ఆడించడం జరిగింది.


ఈ ఏడాది కూడా రూ.20 కోట్లతో విశ్వవ్యాప్తంగా బతుకమ్మను నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుంది. అందులో ప్రతి జిల్లాకు రూ.15 లక్షలు, విదేశాల్లో పండుగ నిర్వహణకు రూ.2 కోట్లు కేటాయించారు. సద్దుల బతుకమ్మ రోజున లేజర్ షో, ఫైర్‌వర్క్స్, కల్చరల్ కార్నివాల్ మరియు ఐటీ కంపెనీల సహకారంతో నగరంలో పూల శకటాల ప్రదర్శనలు ఏర్పాటుచేస్తున్నారు. అంతేకాకుండా మొదటిసారిగా 12 ఏండ్లలోపు ఉండే బాలికలతో అక్టోబర్ 7 నుంచి 9 వరకు బొడ్డెమ్మ పండుగ... 1000 మంది కంటిచూపు లేని మహిళలు, బధిరులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా హైటెక్స్‌లో బతుకమ్మ నిర్వహణ... 50 మంది పారామోటరింగ్ ద్వారా ఆకాశంలో బతుకమ్మ హరివిల్లు కనిపించేలా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. 12 దేశాల నుంచి ప్రత్యేకంగా పూలు తెప్పించి బతుకమ్మలను అలంకరిస్తున్నారు. అలాగే 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకు రవీంద్రభారతిలో బతుకమ్మ ఫిల్మోత్సవం, 55 దేశాల ఫొటోగ్రాఫర్ల ఫొటో ప్రదర్శనతో నెలరోజులపాటు ఆర్ట్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఇంతేకాకుండా విదేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాల సహకారంతో  అమెరికా, సింగపూర్, పోలండ్,  ఆస్ట్రేలియా, డెన్మార్క్ లాంటి దేశాల్లో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం కొత్తగా పల్లెప్రజల్లో ఉత్సాహం నింపేందుకు ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలను పంపిణీచేస్తూ, వారి బతుకుల్లో పండుగలని నింపుతున్నారు. మరోసారి ఆ పర్వదినాన్ని జరుపుకునేందుకు మనమందరం సిద్ధమవుదాం.

  1. వెబ్ ఆర్కైవ్ లో పేజీ లంకె (ఈపేపర్)


Wednesday, August 29, 2018

యువరాజునవుతాను... (మనం ఆదివారం సంచిక మకుటంలో 26.08.2018)

రాఖీ పండుగ... ఈ పేరు వినగానే నాముఖం నిండు పున్నమి ఆకాశం అవుతుంది... ఎందుకంటే రాఖీ అనంగానే మా అక్క గుర్తొస్తుంది చెల్లి నవ్వు వినిపిస్తుంది... ఈ రక్తసంబంధ దృశ్యం నా ఒక్కడికేం పరిమితం కాదు... ఇది హృదయాల సవ్వడి సందర్భం... అనురాగాల సంగమ తీరం...

నేను, కాంక్రీట్ జంగిల్‌లో ఎడారిని... జానెడు పొట్ట మూపురాన్ని నడి వీపున మోసుకు తిరుగుతున్న ఒంటెని... ఎప్పుడో ఒక విరామ శ్రమలో ఎండమావి వైపు ఆశగా చూస్తూ ఆకుపచ్చని నా పల్లె బతుకును కలగంటుంటాను... ఏడాదికొకసారి అదిగో అటువంటి తధాస్థు రోజున నా ఆశ మొలుస్తుంది... అంతకు ముందే... నా దేహమంతా అనురాగ వాన కురుస్తుంది... అవును మా అక్క రెక్కలు కట్టుకొని వాలితే పల్లెలో మా రంగు ముగ్గు వాకిలి కనపడుతుంది... చిలుకల నవ్వుతో మా చెల్లి చేరితే మొన్నమొన్ననే నాటిన మా ఊరి వరి పొలాలు కళ్ళముందు కదలాడుతాయి... ఊరి పొలం నుండి గోరటి వెంకన్న పల్లెపాట నాదాకా వినిపిస్తుంటుంది... ఒక చేత్తో రాఖీ మరో చేత్తో మిఠాయి, వాళ్ళ నిండు గుండె దోసిళ్ళతో ప్రేమ పూర్వక దీవెన వహ్... ఇంతకన్నా పండుగేముంది...

ఒకరి గుండె చెరువు నిండుతుంది, ఇంకొకరి మనసు బావి పొంగుతుంది, ఇంకో చోట సంతోష జలపాతం దూకుతుంది, మా ఇల్లే కాదు పట్నాలు నగరాల్లోని అన్నదమ్ముల ఇళ్ళ మత్తడి నుండి ఆప్యాయతా నదీ ప్రవాహాలవుతాయి... కాలంతో పోటీపడి నిమిషాలు గంటలను పనితో కొలుస్తుంటానని గడియారం తన నాడీ స్పందనతో ఏడాదంతా నా దండ చేతిపై సవ్వడి వినిపిస్తుంది... కానీ ఎందుకో... రాఖీ సమీపిస్తుండగానే గడియారం మోము వాడిపోతుంది... రాఖీ పండుగ నాడు నా రక్త బిందువులు కట్టే కంకణాల మధ్య గడియారం బిక్క మొహమేస్తుంది...

నా చేతికి కట్టే రక్షా బంధనం కోసం అక్కచెల్లెళ్ళ లోకకళ్యాణపు విశ్వశాంతి యాగక్రతువు అప్పటికి వారంరోజుల ముందే మొదలై ఉంటుంది... వాళ్ళ ఇల్లు పిల్లలు సంసారం ఉద్యోగాలు వృత్తి వ్యాపారాలు మెట్టినింటి గడపకు అప్పజెప్పే ప్రణాళికలో మునిగి తేలి ఉంటారు...

చెల్లెలు కట్టే రాఖి పొద్దు తిరుగుడు రెక్కల్లా ఉంటుంది, అక్క తెచ్చే రాఖీ ముద్దబంతి పువ్వులా ఉంటుంది... 

నా చేతికి రాఖీ మొలిచాక పట్టాభిషేక యువరాజునవుతాను... నేను బహుకరించే కానుకతో వాళ్ళ మనసులో ఆనందం తాండవిస్తుంటుంది... ఆ సంగీతం ఈ సోదరునికే వినిపిస్తుంది... వాళ్ళు నాతో ఉన్న ధైర్యంతో బాల్యాన పోగొట్టుకున్న రాజ్యాన్ని ఒక్కసారిగా గెలుచుకొస్తాను... జగత్ విజేత అలెగ్జాండర్‌ను అన్న అనే పిలుపుతో కట్టిపడేసిన రోజు కదా... అందుకే ఇంత బలమైన బాంధవ్యం... అక్కా చెల్లి ఉన్నంతసేపు మా బాల్య స్మృతులు గుభాళిస్తుంటాయి...
ఎప్పుడన్నా... తోబుట్టువు రాఖీతో పలకరించకపోతే... నా కళ్ళు కన్నీటి సంద్రాలవుతాయి... పోస్ట్‌లోనైనా అన్నా తమ్ముడూ అన్న పిలుపు వినిపించకుంటే... నా గుండెచెవులు వీధికి వేళాడుతుంటాయి...

రాఖీ అనే రెండక్షరాల రక్షా రేఖ కోసం... తోబుట్టువుల ఆశీర్వచనం కోసం చెల్లెళ్ళు అక్కల వద్దకే నడిచే సోదరులు కూడా ఉంటారు... కులమతాలకతీతంగా కంటికి కనిపించని దేవుడి రూపాన్నే చూపుల్లో నిలుపుకొని కొండాకోన దాటి దర్శించుకునే మనకు... కళ్ళముందు తిరుగాడే తోబుట్టువు దీవెన దైవ శక్తి సమానమే... ప్రహరీ అడ్డు గోడలు మందిర్ మసీదు చర్చ్‌లకేకానీ దేవుడికి కాదు... అలానే సోదరి ప్రేమకు ఆశీర్వాద దీవెనకు కులాలు అడ్డురావు... నీ ముంజేతిని ముందుకు చాపి చూడు, అన్నా చూడు తమ్ముడూ చూడు అంటూ ఒక మసీదు రాఖీ కడుతుంది ఒక చర్చ్ దీవిస్తుంది... అందుకే... లేనోడు ఉంటాడేమో కానీ సోదరి లేనోడెవడూ ఉండకూడదు...

ప్రణయ్‌రాజ్ వంగరి,
తెలుగు వికీపీడియా వ్యాసకర్త


  1. వెబ్ ఆర్కైవ్ లో పేజీ లంకె (ఈపేపర్)
  2. వెబ్ ఆర్కైవ్ లో పేజీ లంకె (వెబ్ పేపర్)