Sunday, July 26, 2015

"దేవత" సీరియల్ జ్ఞాపకాలు

చాలా రోజుల తరువాత ఈరోజు ‘‘చంటిగాడి స్వయంవరం’’ (డైరెక్టర్ Samudram Srinivas అన్న) సీరియల్ షూటింగ్ కి వెళ్ళాను..
అక్కడి వాతావరణం చూడాగానే 2010లో ‘‘దేవత’’ సీరియల్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన రోజులు గుర్తొచ్చాయి...
ఉదయాన్నే 5 గంటలకు లేచి ఫ్రెష్ అయ్యి, 6.15వరకి బస్ లో కవాడీగూడా నుండి యూసఫ్ గూడా చెక్ పోస్ట్ కి రావడం.. అక్కడ 6.30కి ప్రొడక్షన్ వ్యాన్ వచ్చి పికప్ చేసుకొని మణికొండలోని షూటింగ్ స్పాట్ కి తీసుకెళ్లడం... ఉదయం 9.00కి ప్రారంభమైన షూటింగ్ రాత్రి 9.00వరకి జరగడం... మళ్లీ వ్యాన్ లో యూసఫ్ గూడాకి వచ్చి బస్ లో కవాడీగూడా వెళ్లి... తిని పడుకునేసరికి రాత్రి 1 అవ్వడం.. మళ్లీ మరుసటిరోజు ఇదే ఉండడం....
  
దేవత డైరెక్టర్ సత్య ప్రసన్న గారు, కౌశిక్ అన్న, గాయత్రి గారు, బెంగళూరు పద్మ గార్లతో వర్క్ చేయడం గొప్ప అనుభూతిని కలిగించింది. లంచ్ టైంలో అందరం కలిసి భోజనం చేయడం.. ఎలాంటి భేదాలు లేకుండా ఒక కుటుంబంలా ఉండడం చాలా బాగా నచ్చింది.
అక్కడ చేసింది కొన్ని నెలలే అయినా.. అవన్ని నా జీవితంలో మరవలేని రోజులు...
thanks to Pocham Madhu garu and Someshwar Pocham mamayya...







Thursday, July 09, 2015

ప్రేమాక్షరి (కవిత)

కాగితం కలం పట్టుకొని
నవీన సమాజపు
యధార్ధ జీవితాన్ని
ఆవిష్కరించాలన్న తపనతో కూర్చున్న తరుణంలో...
నా మది నిండా నీ ఆలోచనలు
నా ఊహల నిండా నీ ఊసులు
నా తలపుల్లో నీ జ్ఞాపకాలు
నన్ను ఆక్రమించి
నా సంకల్పానికి అడ్డుకట్ట వేస్తూ
నీ స్నేహంజలి గురించి
కవితాంజలి రాసేలా మార్చాయి..
నా ఈ సంకల్పం వికల్పం అయినందుకు బాధపడాలో,
నీ స్నేహాంజలి గురించి కవితాంజలి రాస్తున్నందుకు ఆనందపడాలో తెలియడంలేదు ప్రియా...!

                                                                            ........ప్రణయ్ (09.07.2015)

Saturday, July 04, 2015

2015 నంది నాటకోత్సవ ఫలితాల్లో సీనియర్ జడ్జీల జులూం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టివి, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నంది నాటకోత్సవం మరోసారి వివాదాల పాలు కాబోతుంది....
2013, 2014 నంది నాటకోత్సవానికి నాణ్యతలేని నాటకాలను ఎంపిక చేశారన్న అప్రదిష్ట దారిలోనే, ఫలితాలు కూడా ఉండబోతున్నాయనీ... ఎన్నో ఏళ్లుగా నటిస్తూ తమకు పరిచయం ఉన్న సీనియర్ నటులను ఉత్తమ నటులుగా, తమకు సన్నిహితంగా ఉంటున్న నటీమణులను ఉత్తమ నటీగా ఎంపికచేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారని తెలిసింది..
‘‘యువత నాటకరంగానికి రావాలి, నాటకాల్లో నటించాలి, నాటకాల్ని దర్శకత్వం చెయ్యాలి, నాటకోత్సవాలకు జడ్డీలుగా వ్యవహరించాలని’’ వేదికనెక్కి మైక్ దొరగ్గానే ఉపన్యాసాలు దంచే ‘‘పెద్ద’’ మనుషులు... ఆ వేదిక దిగగానే తాము మాట్లాడిన విషయాలు మరిచిపోతున్నట్లున్నారు.
ఇప్పుడు జరుగుతున్న నంది నాటకోత్సవానికి కొంతమంది యువకులను జడ్జీలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టివి, నాటకరంగ అభివృద్ధి సంస్థ నియమించి, ప్రతి విభాగంలో ఇద్దరు సీనియర్ జడ్జీలు, ఒక యువ జడ్జీ ఉండేలా చూసింది.
అయితే సీనియర్ జడ్జీలు, యువ జడ్జీ యొక్క అభిప్రాయాన్ని తీసుకోకుండా...‘‘నువు చాలా చిన్నోడివి, నీకు వీటి గురించి తెలియదు, మేం చెప్పినట్టు విను’’ అంటూ బెదిరిస్తున్నారని తెలిసింది. వారికి పరిచయమున్న నాటకసంస్థ దగ్గర రూ. 30,000/- డబ్బు తీసుకొని, అన్ని బహుమతులు ఆ నాటక సంస్థకే వచ్చేలా ఫలితాలని ప్రకటించబోతున్నారనీ...ఇదంతా ఒక నాటకరంగ ప్రముఖుడి కనుసన్నల్లో నడుస్తుందని, దీనికి రాష్ట్ర చలనచిత్ర, టివి, నాటకరంగ అభివృద్ధి సంస్థ కూడా వత్తాసు పలుకుతుందని విశ్వసనీయ సమాచారం.
అంతేకాకుండా ప్రాంతీయ విభేదాలు కూడా చూపిస్తున్నారు. తెలంగాణ ప్రాంతం నుండి ఎంపికైన ‘‘రజాకార్’’, ‘‘కొమరంభీం’’ నాటకాలు అసలు పోటీలోనే లేవు అని ఒక సీనియర్ జడ్జీ వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ నాటకోత్సవంలో తెలంగాణ ప్రాంత నాటకాలకు బహుమతులు రాకుండా కొంతమంది అడ్డుపడుతున్నారని వినికిడి.
ప్రతి ఒక్క తెలుగు నాటకరంగ కళాకారుడు కలలుకనే నంది నాటకోత్సవం కూడా రాజకీయం అయిపోతుందని యువకళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..... ప్రణయ్ (29.05.2015)











Friday, July 03, 2015

సంఘర్షణ (కవిత)

నాకెందుకో ఈ వేదన
నాలో నాకెందుకీ నిరంతర ఘర్షణ
దానికి కారణం నువ్వా ? నేనా ?
ముమ్మాటికీ నేనే కావచ్చు
అందుకేనేమో...
ఫలితం కూడా నన్నే బాధిస్తుంది.....

అర్హత లేని నిను అందలమెక్కించింది నేను
క్షణక్షణం అనుక్షణం నీ ఉన్నతిని ఆశించింది నేను
కన్నవారు కాదన్నా....
అయినవారు అడ్డుకున్నా....
నలుగురిలో నవ్వులపాలైనా....
నీపై ఇష్టంతో అవేవి కష్టంకావనుకున్నా....
నాలోకం దిగి వచ్చి నీవే నాలోకమన్నా....

ఇందులో నీ తప్పేంలేదు
ఆశావాదం నాది... అవకాశావాదం నీది...
వెండి `వెన్నెల'లా వెలుగులు ప్రసరించి
మండే ఎండని మిగిల్చివెళ్లావు.....
                                      ప్రణయ్......(02.07.2014)

కార్పోరేట్ బడులు (కవిత)

కార్పోరేట్ బడులంటా... కలలు నిజం చేస్తయంట
అందని ఆకాశాన్ని, ఆశల సౌధాలను
అతిసులువుగా అందిస్తయంట...

అందమైన బాల్యాలు, లేత వయసు పసితనాలు
కాంపిటీషన్ ప్రపంచంలో
ఆనందాలకు దూరమవుతయంట...
కార్పొరేట్ కలుషిత వ్యవస్థలో
కనుమరుగైపొతుంది
మన వారసత్వపు బాల్యమంత...

ఏటినీటి చేపల్లా స్వేచ్చగా తిరుగాల్సిన చిట్టిచిట్టి పాపలు
గాజుపలకల అందమైన అక్వేరియాల్లాంటి
ఇరుకు గదుల్లో కృత్రిమ జీవులవుతయంట...

తాతయ్యల కబుర్లు, నానమ్మల కథలు వింటూ
నిదురించాల్సిన పసి హృదయాలు
నాలుగు గోడల క్లాస్ రూంలో బందీలవుతయంట...

హోంవర్క్ భూతంతో పుస్తకాల పురుగులై
క్షణక్షణం అనుక్షణం
మార్కులకై యాతనంట...

కంప్యూటర్ పై కళ్లు, అమెరికా వైపు కాళ్లతో
డాలర్లే లక్ష్యంగా సాగే ఈకాలపు చదువుల్లో
ధనార్జనేకానీ, విజ్ఞానార్జన ఉండదంట...

ఏ విద్యాసంస్థలోనైనా
ర్యాంకులకై ఆరాటం, చదువులతో పోరాటం
దినదిన పరిక్షల సంద్రంలో బతుకే ఓ సంకటం

విద్యాలయాలు కావవి...విద్యా విక్రయ శాలలే
విద్యావేత్త లేరెవ్వరు....అంతా వ్యాపార వేత్తలే
ర్యాంకుల పంటలు పండించే... మోతుబరీ రైతులే...
                                                ప్రణయ్...(13.10.2014)


దారుణం (కవిత)


వాళ్ల ఆనందం... దేవుని కన్నుకుట్టిందేమో....
వాళ్ల పరవశం.... ప్రకృతి కుళ్లుకుందేమో....
ఫలితం.... ఒక దారుణం
*****
చదువులమ్మ చల్లని ఒడిలో నిద్రించాల్సినవాళ్లు
మృత్యుకౌగిలిలో నిర్జీవులై పడున్నారు....
చిరకాల గుర్తులుగా ఉంచుకోవాల్సినవాళ్లు
చివరి గుర్తులుగా మిగిలారు.....
చుట్టున్న అందమైన లోకంలో విహరిస్తూ
అందరాని లోకానికి వెళ్లిపోయారు....
*****
ఇరవైఐదు సంవత్సరాల ప్రాయంలో
నూరేళ్లు నిండాయేమో....
మృత్యువు తమని కబళిస్తుందని తెలిసి
ఆ పసి హృదయాలు ఎంతగా తల్లడిల్లాయో....
ఎవరైనా తమని రక్షిస్తారని
ఎంతగా ఎదురుచూశాయో....
ఆ చీకటి ప్రవాహంలో
చివరి శ్వాసవరకు ఎంతగా రోదించాయో.....
*****
కళ్లముందే సన్నిహితుల్ని జలప్రళయం మింగేస్తున్న
ఏంచేయలేని నిస్సహాయ పరిస్థితి నరకంకాక మరేమిటి...
ఇలాంటి అనుభవం పగవారికి కూడా రాకూడదు ఏనాటికీ..... ప్రణయ్. (12.06.2014)
(10.06.2014. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ నదిలో జరిగిన సంఘటనకు చలించి)