Wednesday, April 03, 2019

తెలంగాణపై నిందలేల సారులు..?

తెలంగాణపై నిందలేల సారులు..?

(మన తెలంగాణ_30.03.2019)

ఇదేం కాలం అంటే ఎండాకాలం అని ఎటకరించకండి. కలికాలమనో కలిసిపోయే కాలమనో మిటకరించకండి. ఓటు హక్కు వయసోళ్లంతా ఇదేం కాలమంటే ఎన్నికల కాలమనే చెప్పాలి. ఈ కాలానికనుగుణంగా ఏమేం టాపిక్స్ జరుగుతుంటయ్, ఏమేం పిక్స్ హాట్ టాపిక్స్ అవుతుంటయ్ అని ఎంత సెర్చినా, గూగుల్ తల్లినడిగినా, ఈకాలపు సెర్చ్ ఫిగర్లెవరంటే... ఇంకెవరు కేసీఆర్, చంద్రబాబు, జగన్, కేటీఆర్, పవన్ కళ్యాణ్, లోకేష్ అనే చూపిస్తుంది. తెలంగాణ ఆంధ్రలో ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకున్నా, ఎవరి మద్దతుదార్లు వాళ్ళవాళ్ళ ప్రమోషన్ దార్లు వాళ్ళకున్నా అసలు నేషనల్ లెవెల్ లో రాజకీయాలకు అతీతంగా కామన్ మ్యాన్ వాయిస్, మేనిఫెస్టో ఎట్లుంటయో ఎరుకనా..?
ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో, ఎవరూ ఎవరికి సపోర్టుగా నిలుస్తరో, ఎవరెవరి మధ్యన అంతర్గత ఒప్పందాలున్నయో ఎటూ తేలని విధంగా ఉన్నయి. అయితే, ఎవరూ అధికారంలోకి వచ్చినా సగటు మనిషి మనుగడ రోజురోజుకు ప్రశ్నార్థకంగా మారుతూనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ అధినేతలపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నయో, వారు ఎలా స్వీకరిస్తున్నరో ఒకసారి ఆలోచిస్తే...
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోవటం, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తలదూర్చటం తెలంగాణ ప్రజలు హర్షిస్తలేరు. చంద్రబాబును మాజీ ముఖ్యమంత్రిగా సమర్ధనేతగా అంగీకరిస్తూనే ఆయన పదేపదే పాత పాట పాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నరు. తాను తెలంగాణ అభివృద్థి ప్రధాతనని, హైటెక్ సిటీ కట్టింది సైబరాబాద్ సృష్టించింది ఐటీ పరిశ్రమకు ఆధ్యుడిని నేనేనని చెప్పుకోవటం ప్రస్తుతం హాస్యాస్పదంగా మారింది. హైదరాబాదులోని సెటిలర్ల ఓట్లతో తిరిగి తెలంగాణ రాజకీయాల్లోకి దూరాలని చూసిన చంద్రబాబుకు ఆ సెటిలర్సే తెలంగాణలో టిడిపికి ఉనికి లేకుండా చేసిర్రు. తోటి తెలుగు రాష్ట్రంగా తెలంగాణ కొత్త రాష్ట్రానికి మద్దతుగా ఉండాల్సిందిపోయి అడ్డుతగిలే యత్నాలు చేస్తుండటం, అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో హైదరాబాదు సభల్లో రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ప్రాంతీయత భావాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడటం పట్ల తెలంగాణ ప్రజలతోపాటు, హైదరాబాదులోని సెటిలర్స్ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నరు. ఆయన తెలంగాణ పట్ల సానుకూలంగా ఉంటే తెలంగాణ ప్రజలు సైతం ఏపీకి ప్రత్యేకహోదా సాధనలో భుజం కలిపేవారన్నది వాస్తవం. ఇదిలావుంటే, నోట్ల రద్దు విషయంలో మరియు ప్రత్యేక హోదా విషయంలో రెండు నాలుకల ధోరణిలో మాట్లాడటంవల్ల తన సొంతరాష్ట్ర ప్రజలనుండి కూడా తనకు చుక్కెదురు పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ దిక్కులేని చంద్రబాబు సెంటిమెంట్ అనే దిక్కును వాడుకుంటున్నడు. తెలంగాణ ఎన్నికల్లో తలదూర్చినందుకు రిటర్న్ గిప్ట్ ఇస్తానన్న కేసీఆర్ మాటను అవసరమున్నా లేకున్నా పదేపదే ఉపయోగిచుకుంటూ ఆంధ్ర ప్రదేశ్ ప్రజల సానుభూతికోసం ప్రాకులాడుతున్నడు. ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతో ఆత్మనూన్యతాభావానికి గురైన చంద్రబాబు ముఖంలో అభధ్రతాభావం స్పష్టంగా కనిపిస్తుంది.
ఇక చంద్రబాబు వారసుడు లోకేష్ మాట్లాడుతున్న విధానం ఆయనకున్న రాజకీయ అవగాహనా రాహిత్యాన్ని సూచిస్తుంది. వేదికనెక్కిన ప్రతిసారీ ఏదో ఒక తప్పు మట్లాడటమో, తన పార్టీనీ తానే తిట్టుకోవడమో చేసే లోకేష్ ఏ సభలో ఏం మాట్లాడుతరో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీని ప్రభావమంతా లోకేష్ ప్రచారంపై పడి, మంగళగిరిలో ప్రచారానికి వెళ్ళిన లోకేష్ వెంట కనీసం 50మంది కూడా రానంత వరకు దారితీసింది. ఇవన్ని చూసికూడా తన స్థాయి ఎంటో తెలుసుకోలేని లోకేష్ కొద్దిరోజులకిందట సీఎం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగించినయి. ఒకవైపు తెలంగాణ సీఎం తనయుడు కేటీఆర్, మరోవైపు కూతురు కవిత తమ తండ్రిని మించిన రాజకీయ పరిణితి కనబరుస్తూ దేశవ్యాప్త ప్రశంశలు పొందుతుంటే లోకేష్ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని జనం అభిప్రాయ పడుతున్నరు. అందుకే కాబోలు ఆయనకు ముద్దుపేరు కూడా పెట్టుకున్నరు.
వీళ్ళిద్దరి పరిస్థితి ఇలావుంటే తెలంగాణ జనం పవనాల్ సార్ అని పిలుచుకునే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరిస్థితి మరోలా ఉంది. పార్టీ పెట్టి ఇన్నిదినాలైన ఎన్నడు ఒక్కమాట సక్కగా మాట్లాడింది లేదు. వేదికనెక్కి మైకు దొరకగానే పూనకం వచ్చినవాడిలా ఊగుతూ, ఎవరో రాసిచ్చిన స్క్రిప్టులోని మాటల్ని ఎదాతధంగా అప్పగిస్తుంటడు. తనది కుటుంబ రాజకీయం కాదంటడు, అన్న నాగబాబుకు నరసాపురం ఎంపీ టికెట్ ఇస్తడు. తనది కుల రాజకీయం కాదంటడు, అనంతపురంలో ఇచ్చిన మాటని పక్కనపెట్టి తన సామాజికవర్గపు ఓట్లున్నచోట్లలో పోటీచేస్తడు. సామాజిక న్యాయంకోసం రాజకీయల్లోకి వచ్చినా అంటడు, తనకుమాత్రం రెండు సీట్లు తీసుకుంటడు. తాను తెలంగాణ, ఆంధ్ర రెండు ప్రాంతాల వాడినంటడు, ఆంధ్ర ప్రదేశ్ విడదీసినప్పుడు 11రోజులు అన్నం మానేసిన అంటడు. ఇలా తన ప్రసంగాల్లో ఏదో ఒకచోట తెలంగాణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్న పవన్ ను గాలివాటం మనిషిగానే తప్ప పూర్తిస్థాయి నాయకుడిగా ఆంధ్ర ప్రజలు లెక్కలోకి తీసుకుంటలేరు. పేరుకు జనసేన అయినా ఆయన వెంట అభిమానులు తప్ప పెద్ద సేన ఏదీ లేదన్నది ఆ పార్టీలోనే వినవస్తోన్న అభిప్రాయం. ధర్నాలు దీక్షల పేరుతో సమయం వృధా చేయటం తప్ప జనసేన పార్టీకి పూర్తిస్థాయి రాజకీయ రూపం కల్పించలేకపోయారని పటిష్టం చేయలేకపోయారన్నది జగమెరిగిన సత్యం. పవన్ పోకడ చూస్తుంటే ఎన్నికలను లక్కీ లాటరీగా భావిస్తున్నడని, గెలుపు తగిలితే తగిలింది లేకపోతే బ్యాక్ టు టాలీవుడ్ అన్న అభిప్రాయం ఆయనలోవుందని ఒకవైపు, జగన్ ఓట్లను చీల్చడంకోసం చంద్రబాబే పవన్ చేత పార్టీ పెట్టించాడనీ,అందుకోసం పవన్ కు భారీగా ప్యాకేజీలు అందుతున్నాయని మరోవైపు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాజశేఖరరెడ్డి మరణం తరువాత పార్టీని స్థాపించిన జగన్ 2014లో రాష్ట్ర విభజన తరువాత తన పార్టీని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికే పరిమితం చేసిండు. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 341 రోజులపాటూ 13 జిల్లాల్లో 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నడేకానీ, ఏనాడు తెలంగాణ రాష్ట్రంపై కానీ, తెలంగాణ నాయకులపై కానీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. అంతేకాకుండా ప్రభుత్వ వైఫల్యాలను జనం దృష్టికి తీసుకెళ్ళి వారి దగ్గరనుండి పాజిటీవ్ రెస్పాన్స్ ను సంపాధించిండు. దీనిని బట్టిచూస్తే ఈసారి జగన్ వైపు అనుకూల ఫలితం వచ్చేలా కనిపిస్తుంది.
ఇక, అరవై ఏండ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తెలంగాణ ప్రధాత కేసీఆర్ ను తీసుకుంటే... ఒంటిచేత్తో తెలంగాణ మహాపర్వతాన్ని పెకిలించి తెచ్చి ప్రజల కల నెరవేర్చిన కేసీఆరే నిజమైన బాహుబలి. ఢిల్లీ మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించడమేకాకుండా గత అయిదేళ్ళలో ఆదర్శ పాలన సాగించి, ఆసరా పించన్లతోనే కేసీఆర్ తన పాలన సుస్థిరం చేసుకున్నడు. ఇచ్చినమాట మరువకుండ గత ఫించన్లను 500 నుండి 2000లకు పెంచటమే కాదు వాటిని అమాంతం మళ్ళా పెంచటం లబ్దిదారుల్లో నమ్మకాన్ని రెట్టింపు చేసింది. ఈ పథకం ద్వారా కేసీఆర్ వృద్ధులకు ఇంటి పెద్ద కొడుకుగా మారిండు. రైతన్నలకు పెట్టుబడి రాయితీని నేరుగా వాళ్ళ బ్యాంకు ఖాతాల్లోకే బదిలీ చేయటం వల్ల ఖరీఫ్ రబీల్లో పంటల సాగుకోసం ప్రైవేట్ అప్పులు చేసే తిప్పలు సగానికిపైగా తప్పింది. ఈ మహత్తర పథకానికి రైతన్నలు హర్షం వ్యక్తం చేయటంతో కేంద్రంలోని బీజేపీ సైతం కాపీ కొట్టి తన ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది. అన్నదాతల ఆగ్రహం తప్పించుకోవటానికి కేసీఆర్ పథకాన్ని అడ్డం పెట్టుకుంది. కేసీఆర్ ప్రవేశపెట్టిన కేజీ టు పీజీ ఉచితవిద్య పేద కుటుంబాల్లోని విద్యార్థులకు వరంగా మారింది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద మధ్యతరగతి తల్లిదండ్రులకు ఎంతో తోడ్పాటుగా నిలుస్తున్నయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయా కుటుంబాల్లోని పెళ్ళీడు ఆడపిల్లలకు మేనమామగా మారి వారి పెళ్ళిళ్ళు చేయిస్తున్నట్టయ్యింది. పేదలకు డబుల్ బెడ్ రూం పథకం పూర్తిస్థాయిలో అమలు కాకపోయినా అట్టడుగు జనం కొందరికైనా సొంతింటికల నెరవేర్చింది. సంక్షేమ పథకాలుకాక అభివృద్ధి పథకాలు చూస్తే చాంతాడంత లిస్టుంది. మిషన్ కాకతీయతో చెరువుల పూడిక తీయించి సాగునీటి వసతులు మెరుగు పరచటం, మిషన్ భగీరథతో పట్టణాలు నగరాల్లో మంచినీటి ఎద్దడి నివారించటం, హరితహారం ద్వారా చెట్లను కోట్ల సంఖ్యలో నాటి పర్యావరణానికి పాటుపడటం వంటివి నిజంగా చాలా గొప్ప పనులు. వీటన్నింటిని చూసిన యావత్ భారత ప్రజలు రాజకీయాలకు అతీతంగా కేసీఆర్ ను అభినందించిర్రు, దేశంలోనే అత్యుత్తమ సీఎంగా ఎంపికచేసిర్రు. ఇన్ని కోణాల్లో కేసీఆర్ గురించి జనం జేజేలు పలుకుతుంటే, పక్క రాష్ట్రపోళ్ళు మాత్రం తెలంగాణ మీదనే ఏడుస్తున్నరు.
అయితే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ కూడా చంద్రబాబుపై వ్యాఖ్యలు చేయగాలేంది,చంద్రబాబు చేస్తే తప్పేంటి అని అనేవాళ్లు లేకపోలేదు. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొన్నడు. 60 ఏళ్ళనుండి హైదరాబాదును తానే అభివృద్ధి చేస్తున్నానని చెప్పుకోవడంతోపాటు ప్రాంతాల ప్రస్థావన తెచ్చి విద్వేషాలు రగిలేలా రెచ్చగొట్టిండు. మరోవైపు బాలకృష్ణ కూడా తన ప్రచారంలో కూడా ఇదే పద్ధతిని కొనసాగించిండు. దాంతో కేసీఆర్ తన ప్రసంగాల్లో చంద్రబాబు ప్రస్తావన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అనుకున్నట్టుగానే కేసీఆర్ భారీ మెజారిటీతో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యిండు. ఆరోజు పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ''తెలంగాణలో విద్వేషాలు రగిలేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు రానున్న ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా'' అన్నడు. అనడమైతే అన్నడు కానీ ఇప్పటివరకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో కేసీఆర్ జోక్యం చేసుకోలేదు. ఈ విషయం రెండు రాష్ట్రాల ప్రజలందరికి తెలుసు. అయితే, తన ఐదేళ్ళ పాలనలో ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన అభివృద్ధిని ప్రజల ముందుకు చెప్పే ధైర్యం చేయని చంద్రబాబు, గంటకో మాట మారుస్తూ ప్రజల్ని రెచ్చగొడుతున్న పవన్ లు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ మాటను అడ్డు పెట్టుకొని బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నరు.
ఈ ఆంధ్ర నేతల వికృత చేష్టలు చూస్తున్న తెలంగాణ ప్రజానీకం ''మా తెలంగాణ విషయం పక్కన పెట్టి, మీది మీరు చూసుకోండి సారులు'' అంటూ ముక్తకంఠంతో హితబోధ చేస్తున్నరు.
---ప్రణయ్‌రాజ్ వంగరి



  1. వెబ్ ఆర్కైవ్ లో పేజీ లంకె (ఈపేపర్)
  2. వెబ్ ఆర్కైవ్ లో పేజీ లంకె (వెబ్ పేపర్)


No comments:

Post a Comment