Sunday, August 14, 2016

"బొమ్మల రామారం" రివ్యూకథ:
బొమ్మల రామారం అనే ఒక ఊరు. రామన్న ఆ ఊరికి చిన్న దొర. ఆఖరి దొరగా చెప్పుకునే రామన్న దొరతనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఓ గడీ. అధికారం, ఆస్తికోసం తండ్రినే చంపి రెండు రోజులు శవాన్ని ఇంట్లోనే పెట్టుకున్న కిరాతకుడు. తరాలుగా వస్తోన్న ఆస్తిని, పదవులను అనుభవించాలనుకుంటున్న రామన్న, తన తండ్రి స్థానంలో బై ఎలక్షన్లలో నిలబడతాడు. కానీ ప్రజాబలంతో పాటు రామన్న తండ్రికి రైట్ హ్యాండ్ గా ఉన్న లింబన్న ఆ సీట్ తనకివ్వమని చెబుతాడు. రామన్న దగ్గర ఉండే గణేష్ మాటలు విని తనే పోటీకి దిగుతాడు రామన్న. చిన్న చిన్న సెటిల్‌మెంట్స్ చేసి బతుకుతూ, దుబాయ్ వెళ్ళాలన్ననుకుంటున్న సూరి అనే యువకుడిని, రామన్న తన వర్గంలో చేర్చుకుంటాడు. లింబన్న వర్గం నుంచి వచ్చి పరోక్షంగా రామన్న గెలుపుకోసం కృషి చేస్తాడు సూరి. సంగమిత్ర అనే ఆర్నతాలజిస్ట్ బొమ్మలరామారానికి వస్తుంది. మొదటి చూపులోనే నచ్చిన సంగమిత్రను సూరి ప్రేమిస్తాడు.  అదే సమయంలో బొమ్మల రామారం పక్కన కట్టే ప్రాజెక్ట్ కు రెవిన్యూ ఆఫీసర్ గా వచ్చిన కార్తీక్ తో సంగమిత్ర ప్రేమలో పడుతుందీ. అయితే తన భూముల వ్యవహారంలో జోక్యంచేసుకున్న కార్తీక్ ను చంపించి, ఆ హత్యా నేరాన్ని సూరిపై మోపేలా చేస్తాడు రామన్న. ఎదురు తిరిగిన సంగమిత్రను ను కిడ్నాప్ చేయించి, ఆ అమ్మాయి అత్యాచారానికి గురయ్యేందుకు పరోక్షంగా కారణమవుతాడు. అయితే జైలు నుంచి వచ్చిన సూరి.. రామన్నకు ఎదురు తిరిగి, ఈ సంగమిత్రను ఎమ్మెల్యేను చేస్తానంటూ సవాల్ విసురుతాడు. మరి ఆ సవాల్ లో ఎవరు గెలిచారు. ఆమె ఎమ్మెల్యే అయిందా లేదా.. అసలు ఆ ఊరికి రామన్న చివరి దొర అని ఎందుకు చెబుతున్నారు అనేది మిగతా కథ.

విశ్లేషణ:
మంచి కథను ఎంచుకున్న దర్శకుడు దాన్ని కరెక్ట్ గా ప్రజెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. అయితే, గ్రామీణ నేపథ్యం, అక్కడి రాజకీయాలూ, దొరతనం నుంచి పుట్టే క్రైమ్ చుట్టూ ఓ సినిమా చేయాలన్న దర్శకుడి ఆలోచనను మెచ్చుకోవచ్చు. కానీ, చెప్పదలుచుకున్న అంశం, దానికి సంబంధించిన నేపథ్యం తప్ప సినిమాలో బలమైన కథ లేకపోవడంతో సినిమా మొత్తం గజిబిజిగా ఉంది. మొత్తం సన్నివేశాలను అతికించినట్లు కనిపించింది.  రకరకాల పాత్రలు, ఏపాత్ర ఎందుకు వస్తుందో, ఎవరికి ఏమవుతారో అర్థంకాదు. క్లారిటీ లేని అనవసరమైన పాత్రలు ఎక్కువగా ఉన్నాయి. ఇక దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో అతనికి సరైన క్లారిటీ లేదనేది ప్రతి సీన్ లో స్పష్టమవుతుంది.  గ్రామం అంటే ఇలాగే ఉంటుందనేలా లొకేషన్స్ ఆకట్టుకున్నా.. ఇప్పటికీ గ్రామస్తులు అలాగే ఉన్నారనేలా వారి ఆహార్యాలు అస్సలు బాలేదు. ఇక దొర గడీల్లో జరిగే రాజకీయాలను బాగా చూపించే ప్రయత్నం చేసినా.. వాటి చుట్టూ ఉన్న సన్నివేశాల్లో బలం లేకపోవడంతో అవీ తేలిపోయాయి. అక్రమ సంబంధాలు అనేది గ్రామాల్లో సర్వసాధారణం అన్నట్టుగా చూపించారు.  ఉమాదేవి అనే పాత్ర, ఆ పాత్ర చుట్టూ వచ్చే సన్నివేశాలు అనవసరం అనిపించాయి. ప్రీ క్లైమాక్స్ వరకూ కథ అక్కడక్కడే తిరగడం కూడా బోరింగ్‌గా అనిపించింది. రామాయణం నాటకం వేసే సన్నివేశాలు బాగున్నాయి. సంగమిత్రను అత్యాచారం చేసే సన్నివేశం అనవసరం అనిపిస్తుంది. రామన్న తన ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని, అతన్ని కాపురం చేయమనడం అత్యంత అనైతికంగా అనిపించిన సీన్. సూరి పాత్రలో కంటిన్యుటీ మిస్సయింది. ఒక సీన్ లో జుట్టు గడ్డంతోఉన్న సూరి, ఆ తరువాతి సీన్ లో తకు్కవ జుట్టు గడ్డంతో కనిపిస్తాడు. దీనివల్ల రెండు సీన్లలోని నటుడు ఒకడేనని తెలుసుకోవడానికి ప్రేక్షకుడికి కాస్త సమయం పట్టింది. జైలు నుంచి వచ్చిన సూరి క్లైమాక్స్ లో, సంగమిత్రను అత్యాచారం చేసిన వాళ్లను చంపే విధానం (కత్తులతో గొంతులు కోయడం వంటివి) చాలా సిల్లీగా ఉంది. చివర్లో తుపాకులతో కాల్చుకోవడం కూడా అలానే ఉంది.

నటన:
నటులంతా చాలా బాగా నటించారు. ఈ సినిమాకు సంబంధించి వీళ్లంతా కొత్తవాళ్లు కావడం గమనించదగ్గ విషయం.  రామన్నగా నటించిన ప్రియదర్శి నటన చాలా స్టేబుల్ గా ఉంది. అలాగే సూరి నటన కూడా బాగుంది. సూరి ఫ్రెండ్ మల్లేశ్ గా నటించిన తిరువీర్ నటనకూడా బాగుంది. తెలంగాణ యాసలో మాట్లాడుతూ సినిమాలో కొంతలోకొంత హస్యం పుట్టించాడు. ముఖ్యంగా రామాయణం నాటిక సన్నివేశంలో వాలి పాత్రలో తిరువీర్ చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను నవ్వించాయి. తన ప్రెండ్ కోసం మొసలితో ఫైట్ చేసే సీన్లో అద్భుంతగా నటించాడు. అంజిగా నటించిన మోహన్ భగత్ నటన కూడా ఆకట్టుకుంది.  మిగతా నటులంతా బాగానే నటించారు. అయితే, వారి నటనకు తగ్గ స్థాయిలో సన్నివేశాలు లేకపోవడం వల్ల వారి నటనంతా వృధాగా పోయింది. కానీ, వీళ్లకు ఓ మంచి సినిమా పడితే సహజ నటనతో చెలరేగిపోతారనడంలో ఏమాత్రం సందేహం లేదు.

సాంకేతిక విభాగం:
సాంకేతిక అంశాల పరంగా ఈ సినిమాలో అందరికంటే ఎక్కువ మార్కులు సినిమాటోగ్రఫీకి ఇవ్వొచ్చు. కృష్ణ మాయ ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. కార్తీక్ కొడగండ్ల అందించిన పాటల్లో రెండు పాటలు బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాలేదు. ఎడిటింగ్ ఈ సినిమాకు అతిపెద్ద మైనస్‌లలో ఒకటిగా చెప్పాలి. ఎడిటింగ్ సినిమాకు ఉన్న స్థాయిని కూడా తగ్గించింది.

ప్లస్ పాయింట్స్:
గ్రామీణ నేపథ్యం
నటన
సూరి, తిరువీర్ మధ్య ఉన్న సన్నివేశాలు
తిరువీర్ కామెడీ
సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:
బలహీనమైన కథ, కథనం
అనవసర పాత్రలు, సన్నివేశాలు
నటీమణులు
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్
ఎడిటింగ్
క్లైమాక్స్ లో వచ్చే ఫైట్

చివరగా:
మొదటి సినిమాకే దర్శకుడు నిశాంత్ చేసిన సాహసం, ఎంచుకున్న  నేపథ్యం బాగానే ఉంది. అయితే,  కథ మీద పూర్తి స్థాయి పట్టు, ఒక్కో పాత్ర మీద తిరుగులేని క్లారిటీ వల్ల ఈ సినిమా ఎటూ కాని సినిమాగానే మిగిలింది. ఆకట్టుకునే గ్రామీణ వాతావరణం, దానికి తగ్గట్టు సరైన సినిమాటోగ్రఫీ, నటుల నటన బాగా ఉండడంతో ఒకసారి చూసిరాగల సినిమా. 

నటీనటులు: సూరి, తిరువీర్, ప్రియదర్శి, మోహన్ భగత్, భార్గవ రామ్, కె. సంకీర్తన, రూపారెడ్డి, అభయ్, విమల్ క్రిష్ణ, జ్యోతివర్మ, 
సంగీతం: కార్తీక్ కొడకండ్ల, సినిమాటోగ్రఫీ: అమరనాథ్ రెడ్డి, నిర్మాత: పుదారి అరుణ, రచన, దర్శకత్వం: నిశాంత్ పుదారి
విడుదల తేదీ: ఆగష్టు 12, 2016
రేటింగ్: 2.25/5

No comments:

Post a Comment