Sunday, August 14, 2016

‘చెంబు చిన సత్యం’ సినిమా రివ్యూ



‘‘నిద్రలో కనేది కల.. నిద్రనుండి మేల్కొల్పేది కళ’’ అన్న సూక్తితో ప్రముఖ హాస్యనటుడు సుమన్‌ శెట్టి, కన్నడ హీరోయిన్ ప్రమోదిని ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం చెంబు చిన సత్యం. ఆలూరి క్రియేషన్స్ పతాకంపై ఆలూరి సాంబశివరావు నిర్మించిన ఈ చిత్రానికి నామాల రవీంద్రసూరి దర్శకుడు. ఈ చిత్రం 25న విడుదలైంది.

వాసు ఇంటూరిశరశ్చంద్రమాస్టర్ ఆద్యశ్రీమహేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: తోట.వి.రమణఎడిటింగ్: ఎడిటర్ వెంకట్,సంగీతం: విజయ్ కురాకులపాటలు: మౌనశ్రీ మల్లిక్నిర్మాణ నిర్వహణ: శ్రీహర్ష ఆలూరినిర్మాత: ఆలూరి సాంబశివరావుకథస్క్రీన్‌ప్లే,మాటలుదర్శకత్వం: నామాల రవీంద్రసూరి.

కథలోకి వెళ్తే... సుమన్ శెట్టి ఒక ఎల్.ఐ.సి. ఏజెంట్. తన ఫ్యామిలీ (భార్య, కూతురు, కొడుకు, బావమరిది, మరదలు) తో  ఒక ఖరీదైన ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. అతనికి రాత్రివేళలో వచ్చిన కల మరునాటికి నిజమవుతుంటుంది. ఒకరోజు తన భార్య తనను కొట్టినట్టు కల రావడంతో.. అది జరగకుండా ఇంట్లో ఎప్పుడు సీరియస్ గా ఉండి, ప్రతి చిన్న విషయానికి కోప్పడుతూ.. ఫ్యామిలీ మెంబర్స్ ని గ్రిప్ లో పెట్టుకుంటాడు. వాళ్లందరికి సత్యం ప్రవర్తన నచ్చకపోయినా ఏంఅనలేని పరిస్థితిలో ఉంటారు. ఇంటి ఓనర్ తో జరిగిన గొడవ కారణంగా రాత్రికి రాత్రే సత్యం ఇల్లు ఖాళీ చేయవలసి వస్తుంది. ఆరోజు రాత్రి, కొత్త ఇంట్లో తన కుటుంబ సభ్యులు చనిపోతారని కల వస్తుంది. అప్పటినుండి తనవాళ్లను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంటాడు. తన కల నిజమైందా... కుటుంబ సభ్యులను ఎలా కాపాడుకున్నాడు.. వాళ్ళను కాపాడుకోడానికి సత్యం ఏం చేశాడన్నదే మిగతా కథ.

సాంకేతికాంశాలు
కథకథనం: ఎంచుకున్న కథవస్తువు, స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ఆద్యాంతం ఎంటర్ టైన్ మెంట్ గా సాగిపోతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ కి ముందు వచ్చే దెయ్యం ఎపిసోడ్... డైనింగ్ టేబుల్ దగ్గర సత్యం యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ కుటుంబ సభ్యులు పాడే పాత పాటలు అలరిస్తాయి. పాత్రల యొక్క బలం బలహీనతలను వాయిస్ ఓవర్ ద్వారా చెప్పిస్తూ పాత్రలను పరిచయం చేయడం బాగుంది.

సంభాషణలు: భయపెట్టే వెలుగు కంటే.. భయాన్ని దాచిపెట్టే చీకటే నయం, అలలు కాళ్లకిందికి వచ్చాయని సముద్రాన్ని చులకన చేయోద్దు, వస్తువు పగిలితే శబ్దం వస్తుంది.. మనసు పగిలితే నిశ్శబ్దం మిగులుతుంది వంటి సంభాషణలు ఆకట్టుకుంటాయి. చివర్లో తన కొడుకు గురించి ఒక తల్లి చెప్పే మాటలు స్పందింపజేస్తాయి.

సంగీతం-పాటలు: విజయ్ కురాకుల చక్కని మ్యూజిక్ అందించారు. సన్నివేశానికి తగ్గట్టుగా నేపథ్య సంగీతం, మౌనశ్రీ మల్లిక్ సాహిత్యం బాగుంది.

ఎడిటింగ్: అక్కడక్కడ కొన్ని సీన్లను ట్రిమ్ చేస్తే బాగుండేది.

కెమెరా: సాంగ్స్ లో రిచ్ నెస్ కనిపించింది. అవుట్ డోర్ లొకేషన్స్ లో ఫొటోగ్రఫి బాగుంది.

నటన: కమేడియన్ గా తెలిసిన సుమన్ శెట్టి ప్రధాన పాత్రలో మెప్పించడం చెప్పుకోదగ్గది. ప్రమోదిని కాస్త బొద్దుగా ఉన్నా తన అందంతో, అభినయంతో ప్రేక్షకుల్లో ఒక మార్క్ ను క్రియేట్ చేసుకుంటుంది. ప్రెండ్ పాత్రలో సూర్య, చివర్లో వచ్చే వాసు ఇంటూరి, గాలిపటం సుధాకర్ ల నటన ఆకట్టుకుంటుంది. నూతన నటుడు శరశ్చంద్ర తన పరిధి మేరకు నటించాడు. నటనలో ఇంకాస్త పరిణితి చెందాలి.

దర్శకత్వం: స్వతహాగా రచయితైన నామాల రవీంద్రసూరి తన కథకు పూర్తి న్యాయం చేశాడని చెప్పవచ్చు. మొదటిభాగంలో కాస్త బోర్ గా ఫీల్ అయినా... ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి ఎంటర్ టైన్ గా నడిపించాడు. ఒక్కో సన్నివేశాన్ని చాలా చక్కగా డీల్ చేశాడు.

ఏదిఏమైనా పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద హీరోలు, బడా నిర్మాతల కాలంలో చిన్న సినిమాలు బయటికి రాని తెలుగు సినిమారంగంలో బ్యాక్ గ్రౌండ్ లేని ఒక నూతన దర్శకుడు దర్శకత్వం వహించడం... సినిమా తీయడానికి కొత్త నిర్మాత ముందుకు రావడం... సినిమాను సొంతంగా రిలీజ్ చేసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ విషయంలో దర్శకనిర్మాతలు నూటికి నూరుపాళ్లు విజయం సాధించారని చెప్పవచ్చు. ఎప్పుడు పెద్ద సినిమాలనే కాకుండా చిన్న సినిమాలను కూడా కొత్త ప్రేక్షకులు ఆదరిస్తే.. ముందుముందు మంచి సినిమాలు రావడానికి అవకాశం ఉంటుంది. టోటల్ గా ఇది ఫ్యామిలీ ఎంటర్ టైనర్.

రేటింగ్: 3/5 (ఇది నా అభిప్రాయం మాత్రమే)

No comments:

Post a Comment