Friday, July 03, 2015

కార్పోరేట్ బడులు (కవిత)

కార్పోరేట్ బడులంటా... కలలు నిజం చేస్తయంట
అందని ఆకాశాన్ని, ఆశల సౌధాలను
అతిసులువుగా అందిస్తయంట...

అందమైన బాల్యాలు, లేత వయసు పసితనాలు
కాంపిటీషన్ ప్రపంచంలో
ఆనందాలకు దూరమవుతయంట...
కార్పొరేట్ కలుషిత వ్యవస్థలో
కనుమరుగైపొతుంది
మన వారసత్వపు బాల్యమంత...

ఏటినీటి చేపల్లా స్వేచ్చగా తిరుగాల్సిన చిట్టిచిట్టి పాపలు
గాజుపలకల అందమైన అక్వేరియాల్లాంటి
ఇరుకు గదుల్లో కృత్రిమ జీవులవుతయంట...

తాతయ్యల కబుర్లు, నానమ్మల కథలు వింటూ
నిదురించాల్సిన పసి హృదయాలు
నాలుగు గోడల క్లాస్ రూంలో బందీలవుతయంట...

హోంవర్క్ భూతంతో పుస్తకాల పురుగులై
క్షణక్షణం అనుక్షణం
మార్కులకై యాతనంట...

కంప్యూటర్ పై కళ్లు, అమెరికా వైపు కాళ్లతో
డాలర్లే లక్ష్యంగా సాగే ఈకాలపు చదువుల్లో
ధనార్జనేకానీ, విజ్ఞానార్జన ఉండదంట...

ఏ విద్యాసంస్థలోనైనా
ర్యాంకులకై ఆరాటం, చదువులతో పోరాటం
దినదిన పరిక్షల సంద్రంలో బతుకే ఓ సంకటం

విద్యాలయాలు కావవి...విద్యా విక్రయ శాలలే
విద్యావేత్త లేరెవ్వరు....అంతా వ్యాపార వేత్తలే
ర్యాంకుల పంటలు పండించే... మోతుబరీ రైతులే...
                                                ప్రణయ్...(13.10.2014)


2 comments:

  1. బావుంది ప్రణయ్ గారూ

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు Katta Srinivas గురువు గారు....

      Delete